కళ్లు తెరిచిన సింగర్ కల్పన.. నా భర్త వల్లే ఇలా, వీడియోతో సంచలనం
సినీ నేపథ్య గాయనీ కల్పన ఆత్మహత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. నిద్రమాత్రలు మింగి రెండ్రోజుల పాటు బెడ్‌రూమ్‌కే పరిమితమైన ఆమెను స్థానికుల సాయంతో పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం కల్పనకు ఏమొచ్చింది? ఎవరు ఆమెను ఆత్మహత్య వైపుకు ప్రేరేపించిందెవరు? అంటూ మీడియాలో , సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి.
కల్పన సాంప్రదాయ సంగీత కుటుంబంలోనే జన్మించారు. ఆమె తండ్రి టీఎస్ రాఘవేంద్ర, తల్లి సులోచనలు ప్రొఫెషనల్ సింగర్స్. కల్పన సోదరుడు షికెనా షాన్ కూడా సింగరే. ఎంసీఏ చదివిన కల్పన.. మధురై టి శ్రీనివాసన్ దగ్గర సంగీతం, గానంలో ఓనమాలు దిద్దింది. ఐదేళ్ల చిరుప్రాయంలోనే కుటుంబం అనే సినిమాలో పాట పాడి శెభాష్ అనిపించుకుంది. నాటి నుంచి గాయనిగా రాణిస్తూ .. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వేలాది పాటలతో పాటు 3000కు పైగా షోలు చేసింది.

సింగర్ మాత్రమే కాదు.. కల్పన బహుముఖ ప్రజ్ఞాశాలి . పాటలు పాడటంతో పాటు ఎన్నో పాటలు రాసింది. బాలనటిగా దాదాపు 30కి సినిమాలలో నటించి శెభాష్ అనిపించుకుంది. ఈ ఫేమ్‌తో తెలుగు బిగ్‌బాస్ సీజన్ 1లో అవకాశం దక్కించుకున్న కల్పన.. తొలివారానికే ఎలిమినేట్ అయ్యింది. తెలుగులో పలు ఛానెల్స్, ఓటీటీలో ప్రసారమవుతున్న సింగింగ్ , డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఎందరో యువ గాయకులకు మార్గదర్శకత్వం చేస్తున్నారు. ఎప్పుడూ నవ్వుతూ , నవ్విస్తూ సరదాగా ఉండే కల్పనను సినీ ప్రముఖులు, తోటి గాయకులు ఎంతో అభిమానిస్తారు. అలాంటిది కల్పన ఆత్మహత్యాయత్నం చేశారని, ఆసుపత్రిలో వెంటిలెటర్‌నపై ఉన్నట్లు తెలియగానే అంతా పరుగులు తీశారు.
కల్పన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేయడంతో ఆమె ఒడ్డునపడ్డారు. తన తల్లి మానసిక పరిస్ధితి, ఆత్మహత్యాయత్నంపై ఆమె కుమార్తె దయ కీలక వ్యాఖ్యలు చేశారు తన తల్లి అసలు ఆత్మహత్యాయత్నం చేయలేదని తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని మీడియాను కోరారు. మందుల మోతాదు ఎక్కువ కావడం వల్లే కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లారని దయా తెలిపారు. తన తల్లిదండ్రులు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా అపస్మారక స్థితి నుంచి బయటపడి కోలుకున్న సింగర్ కల్పన ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాను 45 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ , ఎల్ఎల్‌బీ చేస్తున్నానని.. తన భర్త సహకారం వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నానని కల్పన తెలిపారు. వృత్తిపరమైన ఒత్తిడి, కుటుంబ బాధ్యతల మధ్య ఒత్తిడి కారణంగా నిద్రపట్టడం లేదని .. ఇన్సోమియా (నిద్రలేమి) సమస్యకు డాక్టర్ వద్ద చికిత్స తీసుకుంటున్నానని, అందులో ఉన్న మెడిసిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్లే స్పృహ తప్పానని కల్పన క్లారిటీ ఇచ్చారు. నేను ప్రాణాలతో బయటపడ్డానంటే నా భర్త, నా కుటుంబం, కాలనీ వాసులు, పోలీసులు ఆగమేఘాలపై స్పందించడం వల్లేనని .. త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ కల్పన తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











