నీ ఏడుపు నీదే .. ఇండస్ట్రీలో ఎవరూ హెల్ప్ చేయరు , కిరణ్ అబ్బవరంకు దిల్‌రాజు చురకలు
చిత్ర పరిశ్రమలో చిన్నవాళ్లను పెద్ద వాళ్లు తొక్కడం లేదంటే వారిపై ఆధిపత్యం చూపించడం ఎప్పటి నుంచో ఉన్నదే. కొన్ని ఇండస్ట్రీలో నెపోటిజం, మనవాళ్లే ఎదగాలనే వైఖరి కారణంగా ప్రతిభావంతులు, యువత సినీ పరిశ్రమలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి వారి సినిమాలపై దుష్ప్రచారం చేయడం చూస్తున్నదే. తాజాగా యువ హీరో కిరణ్ అబ్బవరం కొద్దిరోజుల క్రితం తను ఓ కంపెనీ టార్గెట్ చేసిన తీరుపై ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలు చిత్ర సీమలో దుమారం రేపాయి. తాజాగా దీనిపై స్పందించారు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్‌రాజు.
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ క . సుజీత్, సందీప్‌లు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. తనపై పనిగట్టుకుని కొందరు ట్రోలింగ్ చేస్తున్నారని.. ఎక్కడో మారుమూల గ్రామానికి చెందిన తాను సినిమాల్లో నటించడమే పెద్ద విజయమన్నారు. నాతో మీకు ప్రాబ్లం ఏంటీ..? కిరణ్ అనే వాడు ఎదగకూడదా అని ఆయన ఘాటుగా విరుచుకుపడ్డారు.

తాను నటించిన 8 సినిమాల్లో నాలుగు డీసెంట్ హిట్లు పడ్డాయని.. నేను ఫెయిల్యూర్ యాక్టర్‌ని కాదని కిరణ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఆఫీస్ ఉందని.. వాళ్ల సినిమాలలో నన్ను ట్రోల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అమ్మ ఎంతో కష్టపడి తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని.. సినిమాలలో తానేంటో నిరూపించుకుని అమ్మ సంతోషపడేలా చేయాలని అనుకున్నానని కిరణ్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.
తాజాగా దీనిపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు స్పందించారు. క సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన.. చిత్ర పరిశ్రమలో తనకు సపోర్ట్‌గా ఎవరూ రావడం లేదని కిరణ్ అన్నారని, కానీ ఇండస్ట్రీలో ఎవరి కోసం ఎవరూ రారని తెలిపారు. ఇక్కడ టాలెంట్ ముఖ్యమని, ప్రతిభ ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరని.. కష్టపడి పనిచేశారు కాబట్టే క అంత పెద్ద హిట్ అయ్యిందని దిల్‌రాజ్ చెప్పారు. మన సక్సెస్ మన గురించి మాట్లాడాలని.. ప్రతీసారి ఎమోషనల్ కావొద్దని కిరణ్‌కు సూచించారు.
మారుమూల గ్రామం నుంచి వచ్చిన తాను చిత్ర పరిశ్రమలో ఈ స్థాయికి చేరుకున్నానని.. నువ్వు కూడా నీ టాలెంట్‌ని నమ్ముకుని తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించావని దిల్‌రాజు ప్రశంసించారు. ఇండస్ట్రీలో మన కృషి , పట్టుదలే మనల్ని నిలబెడుతుందని, ఎవరూ వెనక్కి లాగరు, అండగా నిలబడరని తేల్చిచెప్పారు. నీ సినిమాను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో, ఎలా ప్రేక్షకుడిని రప్పించాలో నువ్వు చూసుకోవాలని.. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే యువతరం ఈ విషయాన్ని గుర్తుంచుకుని కష్టపడి పనిచేయాలని దిల్‌రాజు సూచించారు.


Click it and Unblock the Notifications











