టాలీవుడ్‌కు దెబ్బ మీద దెబ్బ.. వచ్చే నెలలోనైనా కోలుకుంటుందా..?
టాలీవుడ్‌కు కరోనా దెబ్బ గట్టిగానే తగిలింది. సంక్రాంతి తరువాత అసలే బాక్సాఫీస్ వెలవెలబోయి.. కలెక్షన్స్ నిల్ అయ్యాయి. ఫిబ్రవరిలో ఒక్క భీష్మ చిత్రమే ఆదుకుంది. ఆపై బాక్సాఫీస్ మొత్తం ఖాళీగా ఉంది. మార్చిలోనైనా ఆశాజనకంగా ఉంటుందని అనుకుంటే.. కరోనా వచ్చి మొత్తం కొట్టుకుపోయింది.
థియేటర్లు, సినిమా షూటింగ్‌లు, సినీ కార్యక్రమాలు ఇలా అన్నీ రద్దయ్యాయి. షూటింగ్స్ లేక రోజూవారి కూలీల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని తెలుస్తోంది. థియేటర్లు మూత పడటంతో ఆ సెక్టార్ మొత్తం దెబ్బతింది. అయితే ఇదంతా ఒక వారమే ఉంటుందని మొదట ప్రకటించారు. అయితే రాను రాను తీవ్రత మరింత పెరుగుతుండటంతో చిత్రసీమ మరొక సంచనల నిర్ణయం తీసుకుంది.

నిర్మాతల మండలి, మా కార్యవర్గం, 24 క్రాఫ్ట్స్‌కు చెందిన పెద్దలందరూ సమావేశమై.. ఈ బంద్‌ను మార్చి 31 వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ సూచనల మేరకు మార్చి 31 వరకు ఇలాగే కొనసాగుతుందని, ఆపై పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ లెక్కన ఏప్రిల్‌లోనూ పరిస్థితి సద్దుమణిగేలా కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











