తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష

కోట్లాది మంది అభిమానుల నిరీక్షణ ఫలించింది. గత కొద్దిరోజులుగా తమిళనాడులో కొనసాగుతున్న పొలిటికల్ డ్రామాకు తెరపడింది. తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్.. విజయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. దళపతితో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సినీ నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉదయాన్నే స్టేడియానికి చేరుకున్న త్రిష.. అక్కడికి వచ్చిన ప్రముఖులు పేరు పేరునా పలకరిస్తూ సందడి చేశారు. మీడియా కెమెరాలన్నీ ఆమె వైపే ఫోకస్ చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా అభిమానులంతా గోల గోల చేశారు. తమిళనాడు వ్యాప్తంగా టీవీకే అభిమానులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.

Trisha Krishnan Steals Spotlight at TVK Vijay s Swearing-In Ceremony

అంతకుముందు చెన్నైలోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో నెహ్రూ స్టేడియానికి బయల్దేరారు టీవీకే చీఫ్ విజయ్. దారి పొడవునా ప్రజలు, టీవీకే అభిమానులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి విజయ్‌కి అభివాదం చేశారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నెహ్రూ స్టేడియానికి చేరుకున్న విజయ్‌కి అధికారులు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఆ వెంటనే గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌కు స్వాగతం పలికి వేదిక వద్దకు తీసుకెళ్లారు.

విజయ్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో ఏడుగురు టీవీకే ఎమ్మెల్యేలు, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రులుగా ఆదవ అర్జున, ఎన్ ఆనంద్, కేఏ సెంగోట్టియాన్, ఎస్ కీర్తన, కేజీ అరుణ్ రాజ్, పీ వెంకటరామన్, సీఆర్ నిర్మల్ కుమార్ ఉన్నారు. సభలో మెజారిటీ నిరూపించుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరించి మిత్రపక్షాలకు మంత్రిమండలిలో అవకాశం కల్పించనున్నారు విజయ్.

ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రిగా తన సంతకాన్ని మహిళలకు ఉచిత బస్సు పథకంపై చేస్తారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విజయ్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పథకానికి వెట్రిపయనం అనే పేరు ఖరారు చేశారు. ఈ పథకం కింద తమిళనాడు వ్యాప్తంగా అన్ని రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

కాగా.. ఈసారి తమిళనాడు ఎన్నికలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆసక్తిని కలిగించిన సంగతి తెలిసిందే. ద్రవిడ రాజకీయ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకేలను మట్టికరిపించి దళపతి విజయ్ ఆధ్వర్యంలోని తమిళగ వెట్రి కజగం ఎన్నికల్లో చరిత్ర సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఎన్నికల్లో 107 సీట్లతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే అధికారానికి మరో 11 సీట్లు కావాల్సిన దశలో హైడ్రామా నెలకొంది. అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ గవర్నర్ .. విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా నాలుగు సార్లు గవర్నర్‌ను కలిశారు విజయ్. అనూహ్య మలుపులు, సుధీర్ఘ చర్చల అనంతరం శనివారం రాత్రి విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అంగీకారాన్ని తెలియజేయడంతో తమిళనాడులో హైడ్రామాకు తెరపడింది. అయితే మే 13లోగా తమిళనాడు అసెంబ్లీలో విజయ్ తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X