నారాయణమూర్తిలా బతకడం ఎవరి వల్ల కాదు.. నేను అలా రాజీపడ్డా.. త్రివిక్రమ్
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్. నారాయణ మూర్తి 'యూనివర్సిటీ పేపర్ లీక్' సినిమాపై ప్రశంసలు కురిపించారు. నారాయణ మూర్తిని వన్ మ్యాన్ ఆర్మీగా అభివర్ణించిన త్రివిక్రమ్, ఆయన నిబద్ధతను కొనియాడారు. విద్యా విధానం, నిరుద్యోగం వంటి సమస్యలను బలంగా చూపించిన ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఆగస్టు 22న విడుదల కానున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి రూపొందించిన తాజా చిత్రం యూనివర్సిటీ పేపర్ లీక్. ఈ చిత్రం ఆగస్టు 22వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఈ చిత్రాన్ని నారాయణమూర్తి ప్రదర్శించారు. ఈ సినిమాను వీక్షించిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తాను నమ్మిన సిద్దాంతం ప్రకారం సినిమాలను రూపొందించే నారాయణమూర్తి నిజాయితీ, నిబద్దతపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్. నారాయణ మూర్తి తాజా చిత్రం 'యూనివర్సిటీ పేపర్ లీక్' గురించి మాట్లాడుతూ.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
నేను సినిమాల్లోకి రాకముందు నుంచి భీమవరంలో ఉన్నప్పటి నుంచి ఆయనంటే నాకు అభిమానం. ఆర్ నారాయణమూర్తి ఒక సైన్యంలాంటి వ్యక్తి. ఆయన ఒక వన్ మ్యాన్ ఆర్మీ. సినిమాలో రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనే, సైనికుడు కూడా ఆయనే. సినిమా ఆలోచన మొదలుకొని, దాని విడుదల వరకు అన్నీ ఆయనే చూసుకుంటారని, ఇది ఒక గొప్ప విషయం అని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.

ప్రపంచంలో ఏకపక్ష ధోరణి రావడం వల్ల రాబోయే తరాలు సంకుచితంగా తయారవుతాయి. విభిన్నమైన గొంతులు, అభిప్రాయాల్లోనే నిజమైన అందం ఉంది. ఆర్ నారాయణమూర్తి గొంతు అలాంటి ప్రత్యేకమైన పార్శ్వం అని ఆయన అన్నారు.
యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా చూసిన తర్వాత తన అనుభవాన్ని పంచుకుంటూ, రెండున్నర గంటలు చాలా ఫాస్ట్‌గా గడిచిపోయింది. కరోనా తర్వాత ఏ సినిమాను కూడా ఎక్కువసేపు చూడలేని పరిస్థితిలో ఉన్న తనకు, ఈ సినిమా మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. సినిమాలో పేపర్ లీకులు, విద్యా విధానం, నిరుద్యోగం వంటి సమస్యలను బలంగా చూపించారు. ఇందులో ఏది కూడా మనల్ని వెంటనే ఉత్తేజపరిచే అంశాలు కాదు. ఆలోచింపజేసే విషయాలు ఉన్నప్పటికీ సినిమా చాలా బలంగా ఉంది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
ఆర్ నారాయణమూర్తి అభిప్రాయాలను గౌరవించడానికి ఒక కారణం ఉంది. ఆయన వాటిని చెప్పే విధానం, వాటి పట్ల ఆయనకున్న నిబద్ధత ఎవ్వరూ ప్రశ్నించలేరు. ఆయన నిబద్ధత నచ్చే ఆయన పక్కన నిలబడ్డాను. రాజీ పడకుండా బతకడం అందరి వల్ల సాధ్యం కాదు. నేను కూడా చాలాసార్లు జీవితంలోను, సినిమా మేకింగ్‌లోను రాజీ పడ్డాను. తనకు నారాయణమూర్తి గారిని చూస్తే జెలసీ కూడా ఉందని త్రివిక్రమ్ అన్నారు. తన సమయాన్ని వెచ్చించి సినిమా చూపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది అని త్రివిక్రమ్ అన్నారు.
నారాయణమూర్తి మరిన్ని సినిమాలు తీయాలి. ఆయన తీసిన ఒరేయ్ రిక్షా, అర్ధరాత్రి స్వతంత్రం లాంటి సినిమాలు తనకు తెలుసని త్రివిక్రమ్ గుర్తు చేశారు. ఒక సినిమాలో నారాయణమూర్తి గారిని క్యారెక్టర్ కోసం అనుకున్నామని, కానీ రెమ్యునరేషన్ ఇచ్చి ఆయన్ని కొనలేమని నా స్నేహితుడు చెప్పారు. నారాయణమూర్తి డబ్బు కోసమో, సక్సెస్ కోసమో కాకుండా ప్రజలకు నిజం తెలియజేయాలనే తపనతో సినిమాలు తీస్తారు. అందుకే ప్రజలు ఆయన సినిమాలను ఆదరిస్తారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని ఆయన ఆకాంక్షించారు.
సినిమాలో గద్దర్ గారు రాసిన పాట కూడా చాలా బాగుంది. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం తమ వర్తమానాన్ని తాకట్టు పెడుతున్నారని కోణంలో సినిమాలో చూపించిన విధానం తనను కదిలించింది. జ్ఞానం ఆనందాన్ని ఇవ్వాలి కానీ, ఎందుకు ఇంత నొప్పిని, బాధను ఇస్తుంది అని త్రివిక్రమ్ ప్రశ్నించారు. పిల్లలపై ఒత్తిడి పెంచడం వల్ల వాళ్ళు సంతోషంగా ఉండలేకపోతున్నారు. తనకు ఈ సినిమా చాలా నచ్చిందని, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని ఆయన ముగించారు.


Click it and Unblock the Notifications











