మహేశ్ మూవీ కోసం త్రివిక్రమ్ స్పీడు: ఏకంగా అవి కూడా పూర్తి చేసిన గురూజీ
ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను అందుకుంటూ అసాధారణమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే మూవీని చేస్తున్న మహేశ్ బాబు.. ఇది పట్టాలపై ఉండగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై ఆది నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి ఓ ఊహించని న్యూస్ తెగ వైరల్ అయిపోతోంది.
'అతడు', 'ఖలేజా' వంటి డీసెంట్ మూవీల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జత కట్టాడు మహేశ్ బాబు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. మహేశ్‌తో చేసే ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడట. అంతేకాదు, దీనికి డైలాగ్ వెర్షన్‌ను కూడా కంప్లీట్ చేసేశాడని అంటున్నారు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సినిమాలో ఈ డైలాగులే ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. అందుకే ముందుగా వీటినే కంప్లీట్ చేశాడట గురూజీ.

ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేశ్ బాబు రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. అలాగే, అతడి లుక్ కూడా సరికొత్తగా ఉండబోతుందట. ఇందులో సూపర్ స్టార్ సరసన ఎవరు నటిస్తారన్న దానిపై క్లారిటీ లేదు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











