పవన్ కల్యాణ్ నా పక్కన కూర్చుంటే.. నా సతీమణి సౌజన్య వేదికపై మీనాక్షి కల్యాణం.. త్రివిక్రమ్ ఎమోషనల్
కూచిపూడి నృత్యకారిణి, దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్యా శ్రీనివాస్, ఆమె బృందం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలోప్రదర్శించిన 'మీనాక్షి కల్యాణం' అనే నృత్య రూపకానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ నృత్య రూపకాన్ని సమర్పించాయి.

మీనాక్షి నృత్యరూపకం ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, మామిడి హరికృష్ణ (తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్), సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వసంతలక్ష్మి నరసింహాచారి, సంగీత దర్శకుడు తమన్ హాజరయ్యారు. అనిందిత మీడియా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు చుక్కపల్లి సురేష్, కె. సతీష్‌చంద్ర గుప్త తదితరులు పాల్గొన్నారు.
భమిడిపల్లి నరసింహమూర్తి రచించిన ఈ నృత్య రూపకానికి పేరుపొందిన నాట్యకారుడు పసుమర్తి రామలింగశాస్త్రి నృత్యాలు సమకూర్చగా, డీవీఎస్ శాస్త్రి సంగీతం అందించారు. మీనాక్షి, సుందరేశ్వరుల కల్యాణం వెనుక ఉన్న అద్భుతమైన గాథను ఈ రూపకం ద్వారా ప్రదర్శించారు. పార్వతిగా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తన భక్తురాలు విద్యావతికి పుట్టిన మీనాక్షిగా సౌజన్యా శ్రీనివాస్ ప్రదర్శించిన అభినయం, చేసిన నాట్యం ఆహూతులను అమితంగా ఆకట్టుకున్నాయి.
త్రివిక్రమ్ మాట్లాడుతూ, "నాకు మీనాక్షి, సుందరేశ్వరస్వామి వార్ల కథ చాలా ప్రతీకాత్మకంగా అనిపించింది. చూసేవారి కళ్లని బట్టి సౌందర్యం ఉంటుందని చెప్పే చక్కని దృశ్య రూపకం ఇది. ఒకరి అంతర్గత సౌందర్యాన్ని మరొకరు గుర్తించగలిగితే, జీవితమే ఒక వేడుకలా అవుతుంది. నిజమేమంటే స్టేజి మీద నా జీవిత భాగస్వామి ప్రదర్శన ఇస్తుంటే, ప్రేక్షకుల్లో ఒకరిగా నేను 'మీనాక్షి కల్యాణం'ను చూడటం చాలా హ్యాపీగా ఉంది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.
కూచిపూడి కానీ మరో నాట్య విధానం కానీ.. అంతిమంగా అది ఒక కథని చెప్పే కళ. డాన్స్‌లోని టెక్నిక్ ప్రేక్షకులకు సంబంధించింది కాకపోవచ్చు కానీ, దాన్ని ఆస్వాదించే అనుభవం మాత్రం ప్రేక్షకులది. ఈ విషయంలో సౌజన్య, ఆమె బృందం తమ ప్రదర్శనతో మనల్ని అబ్బురపడేట్లు చేశారు. అందుకే ఇప్పటికీ కూచిపూడి నిలిచివుంది, రాబోయే కాలంలోనూ నిలిచివుంటుంది అని భార్య సౌజన్య శ్రీనివాస్‌పై త్రివిక్రమ్ ప్రశంసలు కురిపించారు.
సినిమాల్లోనూ కెమెరా ముందు మేం చేసేది కూడా.. ఒక కథ చెప్పడమే. పసుమర్తి రామలింగశాస్త్రి గారు నా భార్యకు గురువుగా కంటే కూడా, మా కుటుంబంలోని వ్యక్తి లాంటివారు. ఇంతకంటే నేనేం అనగలను? నా జీవితంలోని ఇద్దరు అత్యంత ప్రముఖ వ్యక్తుల్లో ఒకరైన పవన్ కల్యాణ్ గారు ఒకరు నా పక్కన కూర్చుంటే, ఇంకొకరు సౌజన్య స్టేజి మీద ఉన్నారు అని త్రివిక్రమ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











