Ram Charan-Upasana Twins: మీ ప్రేమే మా బలం.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్.. డెలివరీ జర్నీ వైరల్..
Ram Charan-Upasana Twins: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)- ఆయన సతీమణి ఉపాసన కొణిదెలా(Upasana Konidela)దంపతులు ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జనవరి 31 అర్ధరాత్రి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ లో ఉపాసన ఓ పండంటి బాబు, ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించడంతో... మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియా అంతా శుభాకాంక్షలతో నిండిపోయింది. ఇలాంటి ఆనందకరమైన సందర్భంలో తాజాగా ఉపాసన చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే..?
ఉపాసన భావోద్వేగ పోస్ట్ లో ఆమె కేవలం కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా... ఒక తల్లి మనసు, అభిమానులపై ఉన్న నమ్మకం, డాక్టర్లపై ఉన్న గౌరవాన్ని చాలా హుందాగా వ్యక్తం చేశారు. అంతేకాదు, అభిమానుల అత్యుత్సాహంపై కూడా సున్నితంగా స్పందించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

డాక్టర్ల పాత్ర ఎంత కీలకమో ఉపాసన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తేజస్వి గారు సహా అపోలో హాస్పిటల్స్ మొత్తం వైద్య బృందానికి ఆమె పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. 'మీ సంరక్షణ, నిబద్ధత మాకు సర్వస్వం' అంటూ వైద్యుల సేవలను కొనియాడారు. డెలివరీ జర్నీకి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ఆసుపత్రికి చేరిన క్షణాల నుంచి, డెలివరీ తర్వాత కుటుంబ సభ్యులు, అభిమానుల ఆనందం వరకు అన్నింటినీ ఆ వీడియోలో చూపించారు. ఇందులో డాక్టర్లు, స్టాఫ్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ అందరూ కనిపించడంతో నెటిజన్లు భావోద్వేగంగా స్పందిస్తున్నారు.
అలాగే.. మెగా అభిమానుల గురించి ప్రస్తావిస్తూ.. 'మీ ప్రేమ మంచి మనసు నుంచి వస్తుందని నాకు తెలుసు. మా పిల్లల భద్రతను, వారి వ్యక్తిగత గోప్యతను మీరు ఎల్లప్పుడూ గౌరవిస్తారని, వారిని కాపాడతారని నేను నమ్ముతున్నాను' అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యాన్స్ కూడా "వదినమ్మ... పిల్లల క్షేమం మేమే చూసుకుంటాం" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫైనల్‌గా ఉపాసన ప్రపంచవ్యాప్తంగా తమ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 'మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ మా హృదయంలో పదిలంగా ఉంటాయి. మా కుటుంబం నిజంగా అదృష్టవంతులం' అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
ఉపాసన షేర్ చేసిన వీడియోలో డాక్టర్లు మాట్లాడుతూ.. తల్లి, పిల్లల భద్రత కోసం రెండు టీమ్స్ పనిచేశాయని వెల్లడించారు. ఒక టీమ్ హైదరాబాద్ అపోలో నుంచి, మరో టీమ్ చెన్నై అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి వచ్చి పూర్తి కేర్ తీసుకున్నారని చెప్పారు. ఉపాసన అపోలోను తన ఇంటిలా భావిస్తుందని, మొదటిసారి అడ్మిట్ అయిన అదే రూమ్‌లో మళ్లీ అడ్మిట్ కావడం తమకు సెంటిమెంట్‌గా మారిందని డాక్టర్లు తెలిపారు.
ఇక ప్రముఖ జ్యోతిష్కుడు కూడా వీడియోలో మాట్లాడుతూ... జనవరి 31 రాత్రి 11.30 తర్వాత డెలివరీకి మంచి సమయమని చెప్పారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఉపాసన డెలవరీ జర్నీ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











