US-Israel Attacks Iran: యుద్ధంలో చిక్కుకొన్న టాలీవుడ్ హీరోయిన్.. మోడీకి అలా రిక్వెస్ట్!
గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్‌పై గత కొంతకాలంగా యుద్ధానికి కాలుదువ్వుతున్న అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్‌లు అన్నంత పనిచేశాయి. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో అమెరికా చేపట్టిన ఈ దాడులతో ఇరాన్‌తో పాటు పశ్చిమాసియా అంతటా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీఖమేనీ పాలనను అంతం చేయడంతో పాటు ఇరాన్ అణ్వాయుధ సామర్ధ్యాన్ని దెబ్బతీయడం ఈ దాడుల లక్ష్యంగా విశ్లేషకులు చెబుతున్నారు.
అటు అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు కౌంటర్‌గా ఇరాన్ రంగంలోకి దిగింది. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగడంతో గల్ఫ్ దేశాలు వణుకుతున్నాయి. పలువురు విదేశీయులు కూడా ఈ యుద్ధంలో చిక్కుకుపోయారు. వీరిలో భారతీయులు కూడా ఉన్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఈ యుద్ధంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతూ.. తనను కాపాడాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా ముందు నుంచి ప్రిపరేషన్స్ మొదలుపెట్టింది. గల్ఫ్, పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న సైనిక స్థావరాల నుంచి భారీగా సైనికులను ఇరాన్ సరిహద్దులకు పంపడంతో పాటు తన అత్యాధునిక విమాన వాహక నౌకలు యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్, యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌లను ఈ ప్రాంతానికి తరలించింది. వీటి వెంట ఫైటర్ జెట్‌లు, గగనతల రక్షణ వ్యవస్థలు, నిఘా విమానాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా దెబ్బకొట్టడానికి సర్వసన్నద్ధంగా ఉంది.
శనివారం ఉదయం 9.27 గంటలకు అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడులకు దిగాయి. తొలుత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి చెందిన ఇళ్లు, కార్యాలయాలే లక్ష్యంగా ఈ దాడులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇరాన్ వ్యాప్తంగా బాంబు మోత మోగింది. ఆ వెంటనే ఇరాన్ ప్రతిదాడులు మొదలుపెట్టింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈతో పాటు 7 దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. దాంతో ఇజ్రాయెల్, యూఏఈ, ఇరాక్ తదితర దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో వేలకొద్ది విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దాంతో వేలాదిమంది విదేశీయులు విమానాశ్రయాల్లో ఇరుక్కుపోయారు. వారిలో భారత్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఉన్నారు.
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. విమానాలు రద్దు కావడంతో దుబాయ్‌లో చిక్కుకుపోయారు. అటు టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా ఇరాన్ యుద్ధం కారణంగా దుబాయ్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దుబాయ్‌పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు తమ ఇంటి మీదుగా దూసుకెళ్లాయని, ఈ మిస్సైల్స్ శబ్ధాలు తన కుమార్తెను భయపెట్టాయని. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రజలను సురక్షితంగా కాపాడుతున్న సాయుధ దళాలకు మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు.
ఓ కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్లిన టాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ కూడా ఇరాన్ యుద్ధం కారణంగా నగరంలో చిక్కుకుపోయారు. దాడుల కారణంగా గగనతలాన్ని మూసివేయడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. దీంతో ఆమె బిక్కుబిక్కుమంటూ కాపాడాల్సిందిగా ప్రధాని మోడీకి సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోడీ గారు.. నేను ప్రస్తుతం దుబాయ్‌లో చిక్కుకుపోయాను. విమానాలు రద్దు చేయబడ్డాయి, భారతదేశానికి తిరిగి రావడానికి స్పష్టమైన మార్గం కనిపించడం లేదు. నేను సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి ప్రభుత్వ మార్గదర్శకత్వం, మద్ధతును కోరుతున్నాను అంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ, దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సోనాల్ చౌహాన్ ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











