మార్చి 19 నుంచే ఉస్తాద్ ఊచకోత.. పవన్ ఫ్యాన్స్ కు ముందే పండుగ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్. పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ రిలీజ్ డేట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. మొదట ప్రకటించిన తేదీ కంటే ముందుగానే సినిమా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో ఆనందం వెల్లివిరుస్తోంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ సినిమాను మార్చి 26న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో విడుదల తేదీని ముందుకు తీసుకొచ్చారు.

ఉగాది బరిలో ఉస్తాద్
తాజా ప్రకటన ప్రకారం 'ఉస్తాద్ భగత్ సింగ్'సినిమా ఇప్పుడు మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదే రోజు ఉగాది పండుగ కూడా కావడంతో ఈ తేదీని మేకర్స్ స్పెషల్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పండుగ సమయం కావడంతో సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, అదే సమయంలో విడుదల కావాల్సిన మరో భారీ సినిమా వాయిదా పడటం కూడా ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ 'టాక్సిక్' (Toxic) మార్చి 19న విడుదల కావాల్సి ఉంది. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ఆ సినిమా విడుదలను వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం 'టాక్సిక్' ఇప్పుడు జూన్ 4 న విడుదల కానుంది. దీంతో మార్చి 19న పెద్ద సినిమాల పోటీ తగ్గిపోయింది. ఇదే అవకాశాన్ని వినియోగించుకోవాలని 'ఉస్తాద్ భగత్ సింగ్' టీమ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్
లాంగ్ వీకెండ్
ఉగాది పండుగ మార్చి 19 పండుగ, తర్వాత వచ్చే సెలవులు కలిసి సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరిపి విడుదల తేదీని ముందుకు తీసుకొచ్చినట్లు సమాచారం. మరోవైపు అదే సమయంలో విడుదల కావాల్సిన దురంధర్ 2 సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పెద్ద సినిమాల పోటీ తగ్గడం, ఉగాది సెలవులు కలిసివచ్చే అవకాశం ఉండడంతో ఈ సమయాన్ని క్యాష్ చేసుకోవాలని 'ఉస్తాద్ భగత్ సింగ్' టీమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
స్పెషల్ పోస్టర్ రిలీజ్
రిలీజ్ డేట్ మార్పును అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ 'ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత' అంటూ స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ మాస్ లుక్‌లో కనిపిస్తూ అభిమానుల్లో మరింత హైప్ పెంచేశారు. పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ నిర్ణయాన్ని ఘనంగా స్వాగతిస్తున్నారు. 'ఉగాది పండుగకు పవన్ కళ్యాణ్ సినిమా వస్తే థియేటర్లలో పండుగ వాతావరణం ఖాయం'అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
భారీ అంచనాల్లో సినిమా
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు అభిమానుల్లో మంచి స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తతో సినిమా మీద మరింత ఆసక్తి పెరిగింది. మొదట ప్రకటించిన తేదీ కంటే ఒక వారం ముందే విడుదల కానున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. అభిమానులు మాత్రం ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభించారు.


Click it and Unblock the Notifications