Ustaad Bhagat Singh Trailer Review:‘ఉస్తాద్' ట్రైలర్ రివ్యూ.. పవన్ కళ్యాణ్ ఊచకోత.. రికార్డులు రచ్చ ఖాయం!!
Ustaad Bhagat Singh Trailer Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న తాజా సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ మళ్లీ కలిసి పని చేయడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ వన్ మ్యాన్ షోలా ట్రైలర్
సుమారు 2 నిమిషాల 7 సెకన్ల నిడివితో రూపొందించిన ఈ ట్రైలర్ పూర్తిగా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోలా కనిపిస్తోంది. మొదటి సన్నివేశం నుంచే హీరో ఎలివేషన్‌పై దర్శకుడు హరీష్ శంకర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 'వాడు నీకు భయపడలేదా... అసలు ఎవడికీ భయపడలేదా?' అనే డైలాగ్‌తో కథలోని మాస్ టోన్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్‌లో నడుస్తూ వచ్చే సన్నివేశం అభిమానులకు గూస్‌బంప్స్ కలిగించేలా ఉన్నాయి.

పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో మాస్ హైప్
ఈ ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులేనని చెప్పాలి. 'వయలెన్స్ అంటే మీనింగ్ తెలియకపోవడం మీ అందరికీ ఓ ఫ్యాషన్ అయిపోయింది... చూపిస్తా అర్థం, భావం, అవసరం అన్నీ చూపిస్తా' అనే డైలాగ్ ట్రైలర్‌లో పవర్‌ఫుల్ హైలైట్‌గా నిలిచింది. హరీష్ శంకర్ మార్క్ మాస్ డైలాగులు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక మరో సన్నివేశంలో 'తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం డాన్స్' అని పవన్ చెప్పగానే వచ్చే కౌంటర్ డైలాగ్ సరదాగా ఉంటుంది. అలాగే 'సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేసుకోవడం... ఎవడెవడో లైకులు కొట్టడం కాదు' అనే డైలాగ్ కొంత ఫిలాసఫికల్ టచ్ ఇవ్వడం మరో హైలెట్.
ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీలీల ట్రైలర్‌లో క్యూట్ లుక్స్‌తో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. 'ఆయన కమ్ బ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుతుంది' అని చెప్పే డైలాగ్ ద్వారా పవన్ పాత్రకు హైప్ పెంచారు. అదే సమయంలో పవన్ 'మాయమ్మే... మాయమ్మే' అంటూ దిష్టి తీయడం ఆయనలోని సరదా కోణాన్ని చూపిస్తుంది. మరో కీలక పాత్రలో రాశి ఖన్నా కూడా కనిపించనుంది. ట్రైలర్‌లో ఆమె పాత్ర గురించి పెద్దగా చూపించకపోయినా కథలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
యాక్షన్ - మాస్ ఎలిమెంట్స్
ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన ఫైట్స్, మాస్ ఎంట్రీ షాట్స్ అభిమానులకు పూర్తి స్థాయి మాస్ ట్రీట్‌లా కనిపిస్తున్నాయి. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ రూపొందించిన ఫైట్స్ ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'ఇచ్చి పడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలవుతుంది' అనే డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ ఒక్క డైలాగ్‌తోనే సినిమా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని దర్శకుడు సంకేతం ఇచ్చాడు.
టెక్నికల్ టీమ్
ఇక ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎస్. థమన్ అందించారు. ట్రైలర్‌లో వినిపించిన బీజీఎం మాస్ ఫీల్‌ను తీసుకొచ్చింది. ఎడిటింగ్‌ను కార్తిక శ్రీనివాస్ నిర్వహించగా, ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలను ఆనంద్ సాయి చూసుకున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విజువల్‌గా కూడా గ్రాండ్‌గా కనిపిస్తోంది.
బాక్సాఫీస్ పోటీ
ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వాస్తవానికి ఈ సినిమాను మొదట మార్చి 26న విడుదల చేయాలని భావించారు. కానీ, టాక్సిక్ మూవీ వాయిదా పడటంతో షెడ్యూల్ మార్పులతో ముందుకు తీసుకువచ్చారు. ఇదే రోజున ధురంధర్ 2 (Dhurandhar: The Revenge) కూడా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది.
ఇలా 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ పూర్తిగా మాస్ ఎలిమెంట్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పాలి. ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తే విడుదల రోజున థియేటర్ల వద్ద అభిమానుల సందడి భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఉగాది సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications