అపుడు మహేష్ వెనకాల, దెబ్బలు తిన్నా.. ఇదీ నా జర్నీ: వంశీ పైడిపల్లి
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది.
మే 9న ప్రపంచవ్యాప్తంగా 'మహర్షి' చిత్రం విడుదలువుతున్న నేపథ్యంలో బుధవారం(మే 1) నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.

టిక్కెట్ల కోసం దెబ్బలు తిన్నాను, పేపర్లు విసిరాను
హైదరాబాద్‌లో పుట్టి పెరిగి... ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో టికెట్స్ కోసం దెబ్బలు తిని, సినిమాలు చూసి, హీరో ఇంట్రడక్షన్లో పేపర్లు విసిరిన వాడిలో నేనూ ఒకడిని. నాతో పేపర్లు విసిరేసిన ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మీరు టికెట్ కొన్నపుడు హీరో దగ్గర నుంచి ఏం కోరుకుంటారో నాకు తెలుసు... మహేష్ బాబు లాంటి హీరో ఫోటో పోస్టర్ మీద ఉంటే ఏం ఆశిస్తారో తెలుసు.

అపుడు మహేష్ గారి వెనకాల... ఇప్పుడు ఇక్కడ.. అది నా జర్నీ
‘ఒక్కడు' సినిమా సుదర్శన్ థియేటర్లో వేసినపుడు మహేష్ బాబుగారి వెనకాల నాలుగో లైన్లో కూర్చుని చూశాను. ఈ రోజు ఆయన్ను డైరెక్ట్ చేయడం అనేది నా జర్నీ. గతంలో మనం ఎక్కడ ఉన్నాం... ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చూసుకుంటే సంతోషంగా ఉంది. ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసిన అందరికీ చేతులెత్తి దండం పెట్టుకుంటున్నాను. పాదాభివందం చేసుకుంటున్నాను.

ఈ కథకు బీజం వేసింది ఆయనే
మొదట నేను హరి, సాల్మన్‌కు థాంక్స్ చెప్పాలి. ఈ కథకు బీజం వేసింది హరిగారు. ఆయన ఒక క్యారెక్టర్ చెప్పారు. అది నాకు బాగా ఎక్కేసింది. ఆ పాయింటును తీసుకుని నేను, హరి, సాల్మన్ కూర్చుని కథ చేశాం. హరి గారు నాకు దేవుడు ఇచ్చిన బ్రదర్. ఆయన నన్ను ప్రోత్సహించిన విధానానికి, స్పూర్తి నింపిన దానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సాల్మన్ కథ విషయంలో ఎంతో హెల్ప్ చేశారు.

ఆయన ఈ సినిమాకు ఏంజిల్
మోహనన్ గారు షారుక్ ఖాన్‌తో డాన్, అమీర్ ఖాన్‌తో తలాష్, మొన్న అందాధున్ చేశారు. ఆయన ఇండియాలోని గొప్ప డిఓపీల్లో ఒకరు. ఆయన ఈ సినిమాకు ఏంజిల్. ప్రతి రోజూ సెట్టుకు ఒక స్మైల్‌తో వచ్చేవారు. మా టెన్షన్ అంతా పోగొట్టేవారు. ఆయన ఉంటే సెట్లో అంతా సందడిగా ఉండేది.

గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది
పదర పదర సాంగ్ పాండిచ్చేరిలో కంపోజ్ చేసినపుడు 5 నిమిషాల్లో శ్రీమణి పల్లవి రాశారు. సముద్రమెంత దాహమేస్తే వెతకదా ఊట బావినే.. అనే లైన్ రాయగానే ఒక క్యారెక్టర్ ఎన్ని పేజీలు రాస్తే ఈ ఒక్క ఎక్స్‌ప్రెషన్ చెప్పగలం అనిపించింది. ఈ పాట విన్నపుడు గూస్ బంప్స్ వస్తాయి. దేవిశ్రీ కంపోజ్ అద్భుతంగా ఉంటుంది. సినిమాలో ఓ సర్‌ప్రైజ్ కూడా ఉంటుంది. ఆడియోలో రిలీజ్ చేయని సాంగ్ సినిమాలో మీరు వింటారు.

దేవితో నా జర్నీ 16 ఏళ్ల క్రితం మొదలైంది
దేవితో నా జర్నీ 16 ఏళ్ల క్రితం మొదలైంది. దేవి ‘వర్షం' చిత్రానికి కంపోజ్ చేస్తున్నారు. ఆ సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్. అప్పటి నుంచి ఆరేడు సంవత్సరాల పాటు దేవి చేసిన పాట మొదట నేను వినేవాడిని. అది ఎవరికీ తెలియదు. ఆ ఫ్రెండ్షిప్ ఇక్కడి వరకు వచ్చింది.

దిల్ రాజుగారి బేనర్ నా మాతృ సంస్థ
‘మురారి' సినిమా సమయంలో నేను 2 గంటలు డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో టిక్కెట్ల కోసం కూర్చున్నాను. అక్కడి నుంచి దిల్ రాజు గారితో జర్నీ ఇక్కడి వరకు వచ్చింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నా మాతృసంస్థ. వారు నన్ను ప్యామిలీ మెంబర్‌లా చూసుకుంటారు అని వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











