బాలకృష్ణ - గోపీచంద్ సినిమాలో స్టార్ డాటర్: మరోసారి పవర్ చూపించేందుకు రెడీ
క్రిష్ జాగర్లమూడి తీసిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీంతో విజయం కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరో సినిమాకు పచ్చజెండా ఊపేశారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఓ న్యూస్ లీకైంది.
ఈ ఏడాది ఆరంభంలో రవితేజతో 'క్రాక్' అనే సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నాడు గోపీచంద్. అదే ఫార్ములాను బాలయ్య సినిమా కోసం ఫాలో అవుతున్నాడు. ఇందులో భాగంగానే దీన్ని కూడా నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం ఇప్పటికే పల్నాడు ఏరియాకు సంబంధించిన చరిత్రను చదివేశాడు. ఇక, ఇప్పుడు అందులో నటించిన నటీనటులనే తీసుకోవాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే బాలయ్య చిత్రం కోసం కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.

'క్రాక్' సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ జయమ్మ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, ఏకంగా ఈ హీరోయిన్‌ను అదే పేరుతో పిలవడం మొదలెట్టేశారు. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమాలోనూ ఆమె నటించబోతుందని తెలుస్తోంది. ఎంతో ముఖ్యమైన పాత్ర కోసం ఆమెను గోపీచంద్ సంప్రదించగా వెంటనే ఓకే చెప్పేసిందని అంటున్నారు. ఇక, ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











