Varanasi: వారణాసి రిలీజ్ ఎప్పుడంటే? మహేశ్ మూవీపై రాజమౌళి అఫీషియల్ అనౌన్స్‌మెంట్!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తోన్న మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న టేకప్ చేస్తుండటం... రాజమౌళితో మహేశ్ బాబు నటిస్తోన్న మూవీ కావడంతో వారణాసిపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. భారతీయ సినీరంగం నుంచి తొలి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. గత కొన్ని గంటలుగా వారణాసి రిలీజ్ డేట్‌పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌కు దర్శకుడు రాజమౌళి చెక్ పెట్టారు. వారణాసి విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు జక్కన్న చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

స్ట్రాటజీతో రాజమౌళి
ఎస్ఎస్ రాజమౌళి అంటేనే స్ట్రాటజీ... ఏ సినిమాను ఎలా మార్కెటింగ్ చేయాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. తాజాగా వారణాసి విషయంలోనూ అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. పోస్టర్స్, గ్లింప్స్‌తోనే అంచనాలు పెంచడంలో రాజమౌళి దిట్ట. దీనిలో భాగంగా వారణాసిలో నటిస్తోన్న పృథ్వీరాజ్, ప్రియాంక, మహేశ్ బాబుల పోస్టర్స్ విడుదల చేసి అంచనాలను పెంచేశారు. సినిమాను ఎట్టి పరిస్ధితుల్లోనూ వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు రాజమౌళి.
అంటార్కిటికాలో వారణాసి షూటింగ్?
హైదరాబాద్, వారణాసి, ఒడిసా, కెన్యాలలో వారణాసి షూటింగ్స్ జరిగాయి. అయితే త్వరలో అంటార్కిటికాలో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుందని టాక్. ప్రపంచంలో అత్యంత ప్రతికూల వాతావరణం ఉన్న ప్రాంతమైన అంటార్కిటికాలో షూటింగ్ చేయడమంటే సాధారణ విషయం కాదు. గడ్డకట్టే చలి, మంచు తుఫాన్, కఠినమైన పరిస్థితులు, క్షణక్షణానికి మారిపోయే వాతావరణంతో దినదినగండం అనేలా పరిస్ధితి ఉంటుంది. అలాంటి చోట సినిమా షూటింగ్ అంటే మామూలు విషయం కాదు. అక్కడ షూటింగ్ జరుపుకోవాలని పలువురు భావించినప్పటికీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గినవారు ఎందరో.
వారణాసి రిలీజ్ ఎప్పుడంటే?
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌లో వారణాసి సినిమా విడుదల తేదీపై సంగీత దర్శకుడు కీరవాణి క్లారిటీ ఇచ్చారు. వెరైటీగా పోకిరి సినిమాలోని మహేశ్ బాబు డైలాగ్‌తో హింట్ ఇచ్చారు. చాలామంది కూడా 2027 మార్చిలో సినిమా విడుదల అవుతుందని అనుకున్నారు. అయితే గత రెండ్రోజుల నుంచి ఓ మూవీ రిలీజ్‌కు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో హోర్డింగ్స్ మీద 2027 ఏప్రిల్ 7 అని రాసి ఉంది. ఇది వారణాసి సినిమాకు సంబంధించినదేనని అంతా భావించారు. దానికి తగినట్లుగానే మీడియా కూడా కథనాలు ప్రసారం చేసింది. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన లేకపోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రంగంలోకి దిగారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. 2027 ఏప్రిల్ 7న వారణాసి సినిమా ప్రేక్షకుల ముందకు వస్తుందని అధికారికంగా ప్రకటించి ఊహాగానాలకు చెక్ పెట్టారు.


Click it and Unblock the Notifications











