తారాస్థాయికి మెగా - అల్లు అర్జున్ వార్? .. పుష్ప 2 విడుదల రోజే మెగా హీరో మూవీ
తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో ఒకటైన మెగా ఫ్యామిలీలో హీరోలంతా గతంలో మాదిరిగా ఏకతాటిపై ఉన్నారా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే పరిస్ధితులు ఆ విధంగా తయారయ్యాయి. దీనంతటికీ కారణం అల్లు అర్జున్ . చెప్పని బ్రదర్ ఇన్సిడెంట్‌తో మొదలైన ఈ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతూ ఇక్కడి వరకు వచ్చింది. త్వరలో బన్నీ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోసారి మెగా వర్సెస్ అల్లు అర్జున్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొన్నాళ్లుగా మెగా బ్రాండ్ తనకు అక్కర్లేదు అన్నట్లుగా అల్లు అర్జున్ వ్యవహారశైలి ఉంది. అప్పుడెప్పుడో బన్నీ చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన ఓ మూవీ ఈవెంట్‌లో పవన్ అభిమానులు గోల తారాస్థాయికి చేరడంతో చెప్పను బ్రదర్ అనే మాట అనేశారు. ఆ క్షణం నుంచి అల్లు అర్జున్‌ని మెగా ఫ్యాన్స్ .. మెగా ఫ్యామిలీలోని వ్యక్తిగా చూడటం మానేశారు. ఈ పరిణామాలు ఇలా సాగుతూ ఉండగా తాజా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించాయి. తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్ధతు పలికేందుకు బన్నీ తన భార్య స్నేహారెడ్డితో కలిసి నంద్యాలలో దిగారు.

సొంత మేనమామ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కష్టపడుతుంటే ఓ చిన్న ట్వీట్‌తో సరిపెట్టి.. ఫ్రెండ్ వద్దకు స్వయంగా వెళ్లడాన్ని అది కూడా పవన్‌కి శత్రువైన జగన్ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికా అంటూ ట్రోలింగ్ చేశారు. పోలింగ్ ముగిసిన గంటల వ్యవధిలో నాగబాబు ట్వీట్ చేసి ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు. మెగా మేనల్లుడు సాయిథరం తేజ్ .. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డిని తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో వారిని ఆన్‌ఫాలో చేయడం దుమారం రేపుతోంది. పవన్ గెలిచిన తర్వాత ఆయనకు విషెస్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఓ ట్వీట్‌తో సరిపెట్టాడు తప్పించి.. వ్యక్తిగతంగా కలవడం గానీ, ఆఖరికి ప్రమాణ స్వీకారానికి కూడా హాజరుకాలేదు.
ఇంతలో ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 5కి వాయిదా పడింది. మెగా, పవన్ అభిమానులకు భయపడే సినిమా వాయిదా పడినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. కట్ చేస్తే డిసెంబర్ 5న పుష్ప ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12000 థియేటర్‌లలో రిలీజ్ కానుంది. ఎంత పాన్ ఇండియా సినిమా అయినా అల్లు అర్జున్ మెయిన్ బేస్ తెలుగు రాష్ట్రాలే. ఇక్కడి రిజల్ట్‌ను బట్టే సినిమా భవితవ్యం తేలనుంది. ఈ నేపథ్యంలో బన్నీపై మెగా ఫ్యాన్స్ కక్ష తీర్చుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే అనుకోకుండా జరిగిందో? మరేదైనా కారణమో కానీ పుష్ప 2 రిలీజ్ కానున్న డిసెంబర్ 5న మరో మెగా హీరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ నటించిన మట్కా ఆ రోజున ఓటీటీలో రిలీజ్ కానుంది. నవంబర్ 14న ఈ చిత్రం థియేటర్‌లో విడుదల కాగా.. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న మట్కా నెల కూడా తిరక్కుండానే డిసెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే పుష్ప 2 ప్రభావం మట్కాపై పడే అవకాశాలు లేకపోలేదు. మరి ఓటీటీలో వరుణ్ తేజ్ సినిమాను ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











