Matka: 4 గెటప్పులతో వరుణ్ తేజ్.. 24 ఏళ్లలో జరిగే కథ.. ఆ బ్యాక్‌డ్రాప్‌తో 'మట్కా'.. ఇవే ప్రత్యేకతలు
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన వాళ్లలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఒకరు. బాలనటుడిగా సినిమాల్లో యాక్టింగ్ ఎలా ఉంటుందో చూసిన వరుణ్ తేజ్ ముకుంద మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత మిగతా హీరోల్లో కమర్షియల్ సినిమాలు చేయుకుండా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
అలా కంచె, ఫిధా, అంతరిక్షం వంటి ప్రయోగాత్మక సినిమాలతో ఆకట్టుకున్నాడు. అయితే గని సినిమాతో ప్లాప్ చూసిన వరుణ్ తేజ్ ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల గాండీవధారి అర్జున ప్రీ టీజర్ తో ఆకట్టుకున్న వరుణ్ మరో కొత్త సినిమాకు (VT 14) శ్రీకారం చుట్టాడు.

డిఫరెంట్ సినిమాలు: విభిన్నాత్మక సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు వరుణ్ తేజ్. అయితే గత కొంతకాలంగా సినిమాలతో ఫ్లాపులు చూస్తున్న వరుణ్ తేజ్ ఎలాగైనా హిట్ కొట్టాలని ఉవ్విల్లూరుతున్నాడు. అందుకే రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే వరుణ్ తేజ్ నటించిన 'గాండీవధారి అర్జున' (Gandeevadhari Arjuna) చిత్రం ప్రీ టీజర్ రిలీజ్ చేయగా దానికి మంచి స్పందన వచ్చింది.

పలాస దర్శకుడితో: ఇప్పుడు వరుణ్ తేజ్ మరోసారి వైవిధ్యమైన కథతో సినిమా (VT 14) చేసేందుకు రెడీ అయ్యాడు. పలాస (Palasa) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కరుణ కుమార్ తో వరుణ్ తేజ్ 14వ సినిమా చేస్తున్నాడు. వైరా ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డా. విజేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది.

సెలబ్రిటీలతో: పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ తోపాటు అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత సురేష్ బాబు సినిమా స్క్రిప్ట్ ను చిత్ర నిర్మాతల చేతుల మీదుగా డైరెక్టర్ కరుణ కుమార్ కు అందజేయగా.. ముహుర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ మారుతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ హరీశ్ శంకర్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

జూదం పేరు: వరుణ్ తేజ్ 14వ సినిమాకు 'మట్కా' (Matka Movie) అని ఆసక్తికరంగా టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్ డిజైన్ కూడా అట్రాక్ట్ చేసేలా ఉంది. అయితే మట్కా అనేది ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఆడే ఒక జూదం. 1958-1982 మధ్య దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా మట్కా స్టోరీ రాసుకున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా స్టోరీ సాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

అత్యధిక బడ్జెట్: 24 ఏళ్ల వ్యవధిలో జరిగిన కథను రెండున్నర గంటల్లో చూపించనున్నారు డైరెక్టర్ కరుణ్ కుమార్. అందుకోసం వరుణ్ తేజ్ నాలుగు భిన్నమైన అవతారాల్లో (గెటప్పుల్లో) కనిపించనున్నాడు. వరుణ్ మేకోవర్ ఆశ్చర్యం కలిగించేలా ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఈ మూవీ అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోంది.

ఐటమ్ బాంబ్ హీరోయిన్: తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో పాన్ ఇండియాగా వస్తున్న మట్కా సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ ఐటమ్ బాంబ్ నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉండగా.. దాంతో ఓ బాలీవుడ్ స్టార్ తెలుగుకు పరిచయం కానున్నారట. మట్కాలో నవీన్ చంద్ర, వెన్నెల కిశోర్, కన్నడ కిశోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపాలక్ష్మి, విజయరామ రాజు, జగదీశ్, రాజ్ తిరందాస్ నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం: మట్కా సినిమా కోసం వైజాగ్ లో ఒక పెద్ద వింటేజ్ సెట్ నిర్మిస్తున్నారు. 1960 దశకంలో నిర్మాణాలను పోలినట్లుగా సెట్ ఉంటుందట. మట్కా సినిమాకు ఆశిష్ తేజ ప్రొడక్షన్ డిజైనర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా సురేష్ వ్యవహరిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. ప్రియా సేత్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఎడిటర్ గా కార్తీక శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు.


Click it and Unblock the Notifications











