డబ్బుకు అమ్ముడుపోం.. హీరోల గుట్టువిప్పి.. వెన్నెల కిశోర్ సంచలనం
భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ ఇండస్ట్రీలోనూ లేనంత మంది కమెడియన్లు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. కస్తూరి శివరామ్ దగ్గరి నుంచి నేటి వెన్నెల కిషోర్ వరకు ఎందరో హాస్యనటులు ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూనే ఉన్నారు. ఒంటి చేత్తో సినిమాను నిలబెట్టిన కమెడియన్లు.. కమెడియన్ల కోసం సినిమాలు ఆడిన ఉదంతాలెన్నో. అయితే కమెడియన్లపై ఓ రకమైన చిన్న చూపు ఉందని పలువురు బహిరంగంనే వ్యాఖ్యానించారు. తాజాగా టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిత్రసీమలో అడుగుపెట్టిన వారు తమ తొలి చిత్రాన్నే ఇంటి పేరుగా మార్చుకున్నవారెందరో . ఈ కోవలోకే వస్తారు వెన్నెల కిషోర్. తన తొలి చిత్రం వెన్నెలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన దాదాపు 20 ఏళ్లుగా నవ్విస్తూనే ఉన్నారు. అమెరికాలో చదువుకుని , సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎలాంటి ఇబ్బందులు లేని జీవితం గడుపుతున్నప్పటికీ ఆ లైఫ్ తనకు వద్దని సినిమాలపై ఆసక్తితో తిరిగి హైదరాబాద్ వచ్చేశారు వెన్నెల కిషోర్. దేవా కట్టా దర్శకత్వంలో వెన్నెలలో ఖాదర్ భాషా అనే చిత్రంతో ఫేమస్ అయ్యారు.

తర్వాత దూకుడు, రచ్చ, దరువు, జులాయి, దేనికైనా రెడీ, రన్ రాజా రన్, అల్లుడు శీను, సన్నాఫ్ సత్యమూర్తి, సర్కారు వారి పాట, భీష్మ, జాతి రత్నాలు, ఎక్కడికిపోతావు చిన్నవాడా, అల వైకుంఠపురంలో, సీతారామం ఇలా ప్రతి చిత్రానికి వైవిధ్యం చూపెడుతూ నవ్వులు పూయిస్తున్నారు వెన్నెల కిషోర్. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం సైతం తన తర్వాత తన లెగసిని కంటిన్యూ చేసే వారసుడు వెన్నెల కిషోరేనని పలుమార్లు చెప్పారంటే కిషోర్ ప్రతిభను అర్ధం చేసుకోవచ్చు.
ఈ ఏడాది ఇప్పటికే గేమ్ ఛేంజర్, రామం రాఘవం, 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమాలలో నటించి ప్రేక్షకులను నవ్వించిన వెన్నెల కిషోర్ .. రాబిన్‌హుడ్ చిత్రంతో మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నితిన్ - శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలకపాత్ర పోషించారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, టీజర్, ట్రైలర్లతో రాబిన్‌హుడ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా హీరో నితిన్ - వెన్నెల కిషోర్ మధ్య హానెస్ట్ పాడ్‌కాస్ట్ పేరుతో ఫన్నీ ఇంటర్వ్యూ జరిగింది. ఈ సందర్భంగా కిషోర్ తన పంచ్‌లతో నవ్వించారు. మీరు సినిమా ప్రమోషన్స్‌లో ఎందుకు పార్టిసిపేట్ చేయరని నితిన్ అడగ్గా.. యావరేజ్‌గా ఒక కమెడియన్ ఒక నెలలో 6 సినిమాలు చేస్తాడని, హీరో మాత్రం 6 నెలలకి ఒక సినిమా చేస్తాడని అప్పుడు మేం ప్రమోషన్స్ చేయాలా? సినిమాలు చేయాలా? అని కిషోర్ ఆన్సర్ ఇచ్చారు.
మరి ప్రమోషన్స్‌కి డబ్బులిస్తే అని నితిన్ అడగ్గా.. క్యాష్‌తో కమెడియన్స్‌ని కొనలేరని చెబుతాడు కిషోర్. మరి ఈ మూవీ ప్రమోషన్స్‌కి ఎందుకొచ్చారు అని నితిన్ ప్రశ్నించగా చెక్ ఇచ్చారు కాబట్టి అని ఆన్సర్ ఇచ్చాడు కిషోర్. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఫన్నీ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











