అతనిని నమ్మి లక్షల్లో పొగొట్టుకున్నా... స్టార్ హీరోపై నటుడు వేణు షాకింగ్ కామెంట్స్
సినీ రంగం విచిత్రమైనది.. ఇక్కడ వెలిగిపోవాలని, పేరు, డబ్బు సంపాదించాలని ఎంతో మంది యువతీ యువకులు వస్తూ ఉంటారు. కానీ వీరిలో సక్సెస్ అయ్యేవారిని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అన్ని కష్టాలను దాటుకుని, ఏటికి ఎదురీదిన వాళ్లే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. మిగిలిన వారు వచ్చిన దారినే వెనక్కి వెళ్లడమో లేదంటే సొంతూరికి వెళ్లలేక ఇక్కడే ఏదో ఒక పనిచేసుకోవడమే. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనే వాళ్లు లేకుండా నెగ్గుకురావడం కష్టమని ఎంతోమంది సెలబ్రిటీలు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. కానీ బలమైన కుటుంబ నేపథ్యం, ఇండస్ట్రీని శాసించే పరిచయాలు ఉన్నప్పటికీ అడ్రస్ లేకుండా పోయినవారు కూడా ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు వేణు తొట్టెంపూడి.
బలమైన బ్యాక్‌గ్రౌండ్
వేణు తొట్టెంపూడిది బలమైన నేపథ్యం.. తల్లి తరపు, తండ్రి తరపు బంధువులంతా తెలుగు రాజకీయాలను శాసించగల వాళ్లు. స్వయంవరం సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన వేణు తొలి చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత మనసు పడ్డాను కానీ, చిరునవ్వుతో, దుర్గా, హనుమాన్ జంక్షన్, ప్రియ నేస్తమా, మళ్లీ మళ్లీ చూడాలి, కళ్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, చెప్పవే చిరుగాలి వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో ఫ్యామిలీ హీరో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ మధ్యలో ఆయన ట్రాక్ తప్పడంతో వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దాంతో చాలాకాలం పాటు వేణుకు అవకాశాలు రాలేదు. అయినప్పటికీ హీరోగా, సహనటుడిగా, కమెడియన్‌గా అలరించేందుకు వేణు ప్రయత్నించారు. చివరిగా దమ్ము, రామాచారి వంటి చిత్రాల్లో నటించి ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు.

పదేళ్లు సినిమాలకు దూరంగా
దాదాపు పదేళ్ల పాటు అజ్ఞాతంలోనే ఉన్న వేణు.. 2022లో రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో వేణు ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. రామారావు ఆన్ డ్యూటీ తర్వాత ఆయన మరో సినిమాకు కమిట్ కాలేదు. తన వ్యాపారాలు చూసుకుంటూ, కుటుంబంతో గడుపుతున్నారు వేణు. ఆయన తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు అనుపమా చౌదరి. మద్రాస్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన అనుమప.. ఇంటీరియర్ డిజైనింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఆమెను ప్రేమించి పెళ్లాడారు వేణు. ఈ దంపతులకు ఓ బాబు, పాప సంతానం.
సినిమాయే ప్రపంచం
ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వేణు. ఊహా తెలిసినప్పటి నుంచి నా జీవితం సినిమాయే. ఫ్రెండ్ ఇంట్లో చదువుకుంటానని చెప్పి సినిమాకు వెళ్లి మా నాన్నకి దొరికిపోయా. ధార్వాడ్‌లో చదువుకోవడానికి వెళ్లడంతో నన్ను అడిగేవారు లేరు. నేను సినిమాల్లో బిజీగా ఉంటున్నా, నా భార్యే కుటుంబాన్ని, పిల్లలను చూసుకుంటూ వస్తోంది. ప్రపంచంలో టఫెస్ట్ జాబ్ ఏదైనా ఉందంటే అది గృహిణియే అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో జగపతి బాబు గారితో మీకు గ్యాప్ ఎందుకు వచ్చిందని యాంకర్ ప్రశ్నించగా.. వేణు తనదైనశైలిలో ఆన్సర్ ఇచ్చారు.
లక్షలు నష్టపోయా
జగపతితో ఖుషి ఖుషిగా, హనుమాన్ జంక్షన్ సినిమాలు చేశాం. ఆయన చాలా ఫ్రెండ్లీ.. ఏదైనా సాంగ్స్ ఉంటే వేణు మీద పెట్టమని చెప్పేవాడు. హనుమాన్ జంక్షన్ రషెస్ చేసి జగపతిబాబు సీరియస్‌గా వెళ్లిపోతూ.. మొత్తం దొబ్బేశావుగా అని కాంప్లిమెంట్ ఇచ్చారు. రకరకాల స్టార్స్‌తో చేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. జగపతిబాబుతో చిన్న ఇన్సిడెంట్ జరిగింది... దానిని చెప్పాలని కూడా లేదు, ఆర్ధికంగానూ ఎంతో నష్టపోయా. ఆ రోజుల్లో నాకు అది పెద్ద అమౌంటే.. 14 లక్షల రూపాయలు. ఆయన మధ్యలో ఎంటరై.. నాది హామీ అని పర్సనల్‌గా రిక్వెస్ట్ చేశారు. ఆయనను నమ్మి డబ్బు ఇచ్చా.. డబ్బు తీసుకున్న వ్యక్తి సమయానికి నాకు ఇవ్వలేదు. దీని మీద జగపతి బాబు గారు కూడా కనీసం ఫోన్ చేసి అడగలేదు. నేను కూడా వదిలేశా. ఆ తర్వాత ఎప్పుడూ జగపతిబాబును కలవలేదు.. నా బాధలు నేను చెప్పుకోవడానికి ఇష్టపడను అని వేణు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వేణు తొట్టెంపూడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దీనిపై జగపతిబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











