చావా తెలుగు రిలీజ్ ఆపండి.. ఏపీలో ఆ వర్గం పిటీషన్
ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఛావా సినిమా సంచలన విజయం అందుకుంది. దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లతో భారతీయ చిత్ర పరిశ్రమలోని అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్‌లో టాప్ 25లో నిలిచింది. లాంగ్ రన్‌లో ఖచ్చితంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంటుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
మరుగునపడిన చరిత్ర, మన పూర్వీకుల త్యాగాలు, వీరగాథలను గుర్తుచేస్తూ లక్ష్మణ్ ఉటేకర్ ఈ ఛావాను తెరకెక్కించారు. మరాఠా సామ్రాజ్యం, శివాజీ తర్వాత ఆయన కుమారుడు శంభాజీ ఎలా రాజ్యాన్ని పరిపాలించాడు? మొగల్ చక్రవర్తి ఔరంగజేబుతో విరోధం వంటి చారిత్రక అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ సినిమాలో శంభాజీగా విక్కీ కౌశల్, ఆయన సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

థియేటర్‌లలో ఈ సినిమాను చూస్తున్న చిన్నారులు, పెద్దలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కళ్లు తుడుచుకుంటూ బయటికి రావడంతో పాటు జై శివాజీ, జై శంభాజీ అంటూ నినాదాలతో థియేటర్లు దద్ధరిల్లుతున్నాయి. హిందీలో తెరకెక్కినప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఛావాను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇక పరభాషా చిత్రాలలో ఏమాత్రం కంటెంట్ బాగున్నా దానిని బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టే తెలుగు ప్రేక్షకులు కూడా ఛావాను ఆదరిస్తున్నారు. అయితే రూరల్ ప్రాంత ప్రజలు కూడా ఈ సినిమాను చూసేందుకు వీలుగా ఛావాను తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అల్లు అరవింద్ సారథ్యంలోని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ మార్చి 7న ఛావాను తెలుగులో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి డబ్బింగ్, ఇతర పనులను వేగంగా పూర్తి చేసిన యూనిట్ విడుదలకు అన్ని సిద్ధం చేసింది. అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓ రేంజ్‌లో జరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. మరికొద్దిగంటల్లో ఛావా థియేటర్‌లలో రిలీజ్ కానున్న దశలో అనుకోని అడ్డంకి ఎదురైంది. నెల్లూరు జిల్లాలో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఏపీ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ జిలా ఉల్ హకీ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఛావా సినిమా కారణంగా ఉత్తరాదిలో మత ఘర్షణలు జరిగాయని, ఏపీలోనూ అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబును అత్యంత క్రూరుడిగా చూపించారని, చరిత్రను వక్రీకరించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని ఉల్ హకీ ఆరోపించారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని లేని పక్షంలో ముస్లిం సంఘాల నేతలతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాలతో మార్చి 7న ఛావా రిలీజ్ అవుతుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.


Click it and Unblock the Notifications











