పెంపుడు జంతువులను వదిలేయొద్దు.. మానవత్వాన్ని ప్రదర్శించండి.. వెంకటేష్
కరోనావైరస్ సృష్టిస్తున్న మారణహోమం సమయంలో ప్రాణభీతితో అల్లాడుతున్న ప్రజలకు విక్టరీ వెంకటేష్ మానసిక స్థైర్యాన్ని అందించడంలో ముందు నిలుస్తున్నారు. జనతా కర్ఫ్యూ, బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టడంలోను సినీతారలతోపాటు సామాన్య ప్రజలతో మమేకమయ్యారు. అలాగే లైట్ ఫర్ నేషన్ కార్యక్రమంలో కూడా భాగమయ్యారు. తాజాగా పలుమార్లు తెలంగాణ పోలీసులకు మానసిక ధైర్యాన్ని కల్పిస్తూ వారికి అండగా నిలిచారు. తాజాగా వెంకటేష్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసి ప్రజలకు పెంపుడు జంతువులపై అవగాహన కల్పించేందుకు పయత్నించారు.
పెంపుడు జంతువుల వల్ల కొవిడ్ 19 రాదు అని విక్టరీ వెంకటేష్ స్పష్టం చేశారు. తాజా ట్వీట్‌లో.. ప్రస్తుతం మనం విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం. కేవలం మనుషుల మీదనే కాదు.. అన్ని జీవరాశులపై కూడా మానవత్వం చూపించాలి. కరోనావైరస్ వ్యాప్తి అవుతుందని తమ పెంపుడు జంతువులను వదిలివేస్తున్నారనే వార్తలు నాకు చాలా బాధ కలిగించాయి. జంతువుల వల్ల కరోనా రాదని పలు రిపోర్టులు ఇప్పటికే వెల్లడించాయనే విషయాన్ని గుర్తించుకోవాలి అని వెంకటేష్ అన్నారు.

పెంపుడు జంతువులపై ఇలాంటి చర్యలకు పూనుకొని మానవత్వంపై మచ్చ తీసుకురావొద్దు. మీ జీవితంలో భాగమైన జంతువులను సమానంగా ప్రేమించండి. లాక్‌డౌన్ సమయంలో వాటితో ప్రేమగా మసలుకోండి అని వెంకటేష్ సూచించారు.
ప్రాణంగా ప్రేమించే జంతువులు ఈ పోరాటంలో మనకు మానసిక స్థైర్యాన్ని ఇస్తాయి. మీరంత మీ పెంపుడు జంతువులపై ప్రేమ, మానవత్వాన్ని, జాలిని చూపించండి అని వెంకటేష్ కోరారు.
వెంకటేష్ కెరీర్ విషయానికి వస్తే.. F2, వెంకీమామ సినిమాల తర్వాత ప్రస్తుతం తమిళంలో విజయం సాధించిన అసురన్ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న నారప్ప చిత్రంలో నటిస్తున్నారు. కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా ఆ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది.


Click it and Unblock the Notifications











