‘గల్లీ రౌడీ’కి టాలీవుడ్ రౌడీ సాయం: యంగ్ హీరో కోసం వస్తున్న విజయ్ దేవరకొండ
తెలుగులో చాలా మంది హీరోలు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ, వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. మిగిలిన వాళ్లంతా ఎన్ని చిత్రాలు చేసినా సరైన సక్సెస్‌ను అందుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ జాబితాలోకే వస్తాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ.. కెరీర్ మొత్తంలో రెండు మూడు విజయాలనే నమోదు చేసుకున్నాడతను. అప్పుడెప్పుడో అతడు నటించిన 'వెంకటాద్రీ ఎక్స్‌ప్రెస్', ఈ మధ్య వచ్చిన 'నిను వీడని నీడను నేనే' మినహా అన్ని చిత్రాలూ నిరాశనే మిగిల్చాయి. ఈ క్రమంలోనే అతడు మరో చిత్రంతో వస్తున్నాడు.
ఈ ఏడాది ఆరంభంలోనే సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్‌ప్రెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీకి హిట్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా నిరాశనే ఎదురైంది. దీంతో మరో పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అతడు 'గల్లీ రౌడీ' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది.

ఈ నేపథ్యంలో దీని టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. అది కూడా టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా. ఏప్రిల్ 19 సాయంత్రం 5 గంటలకు ఈ మూవీ టీజర్‌ను వదలుతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
సందీప్ కిషన్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గల్లీ రౌడీ'ని వినోదాత్మక చిత్రాల దర్శకుడు జీ నాగేశ్వర్‌రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బాబీ సింహా కీలక పాత్ర చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











