యంగ్ డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ మూవీ.. దిల్ రాజు ఎలాంటి కథతో వస్తున్నారంటే?
డిఫరెంట్ యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోనే విజయ్ దేవరకొండ. ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. స్టార్‌డమ్‌ను అందుకుని సత్తా చాటాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. ఇలా ఇటీవలే 'ది ఫ్యామిలీ స్టార్'తో నిరాశ పరిచాడు.
'ది ఫ్యామిలీ స్టార్' మూవీ కూడా ఆశించిన రీతిలో విజయాన్ని అందుకోకపోవడంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి చిత్రంపై ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌లో సైతం పాల్గొంటున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే అతడి కొత్త చిత్రం గురించి ప్రచారం జరగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాను రవి కిరణ్ కోలా అనే యంగ్ డైరెక్టర్‌తో చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను సదరు సంస్థ కాసేపటి క్రితమే వదిలింది. అంతేకాదు, దిల్ రాజు, విజయ్ దేవరకొండ, రవి కిరణ్ కోలా కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి 59వ చిత్రంగా రాబోతున్న ఇది 'రూరల్ యాక్షన్ డ్రామా'గా తెరకెక్కబోతుందని కూడా చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో విజయ్ దేవరకొండలోని డిఫరెంట్ మాస్‌ను చూపించబోతున్నట్లు వెల్లడించారు. ఇక, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్లను మే 9వ తేదీన చెప్పబోతున్నట్లు మూవీ యూనిట్ తాజా పోస్టులో పేర్కొంది.
వాస్తవానికి దిల్ రాజు - విజయ్ దేవరకొండ నుంచి రాబోయే ప్రాజెక్టును స్టార్ డైరెక్టర్‌తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఊహించని విధంగా రవి కిరణ్ కోలాతో దీన్ని తీస్తున్నారు. ఈ యంగ్ డైరెక్టర్ గతంలో 'రాజా వారు రాణి గారు' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అలాగే, విశ్వక్ సేన్ 'అశోక వనంలో అర్జున కల్యాణం' చిత్రానికి రచయితగా పని చేశాడు.
రవి కిరణ్ కోలా ఇప్పటికే తన స్టామినాను నిరూపించుకున్నాడు. ముఖ్యంగా రూరల్ బ్యాగ్‌డ్రాప్‌పై పట్టు సాధించాడు. అందుకే అతడిపై దిల్ రాజు, విజయ్ దేవరకొండ నమ్మకం పెట్టుకున్నారని అంటున్నారు. ఇక, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైన వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలుపెడతారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











