7500 మందికి మిడిల్ క్లాస్ ఫండ్.. విజయ్ దేవరకొండ ఫౌండేషన్ టార్గెట్ రీచ్
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రజలు ఇబ్బందులుపడుతున్న విషయం తెలిసిందే. భారతదేశంలోనూ కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఈ వైరస్ కట్టడికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. కార్పొరేట్ సంస్థలు, ఎన్జీఓస్, పారిశ్రామికవేత్తలు, సినిమా సెలబ్రిటీలు డొనేషన్ల రూపంలో భారీ మొత్తాలు విరాళంగా అందించారు. ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు ఆ మొత్తాలు అందాయి. అలాగే.. ఇండస్ట్రీ బాగోగుల కోసం సీసీసీ ట్రస్ట్ ఉంది. దానికి హీరో విజయ్ దేవరకొండ 5 లక్షలు విరాళం ఇవ్వటమే కాకుండా ఒకడుగు ముందుకేసి మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో అవసరార్థులకు రేషన్ అందజేసే కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకున్నాడు.

అటు ప్రభుత్వ పథకాలు అందుకోలేక.. ఇటు తమకు తాముగా బ్రతకలేక బాధపడేవారి కోసం విజయ్ ఈ మిడిల్ క్లాస్ ఫండ్ ను ప్రారంభించాడు. చాలా ఛాలెంజెస్ ఉన్నప్పటికీ విజయ్ సేవా దృక్పధంతో ఈ రిస్క్ తీసుకున్నాడు. డబ్బు సేకరించడం, అవసరార్థులను గుర్తించడం, వారికి సేవలు అందేలా చేయడం అనేది చాలా పెద్ద పని. పాతిక లక్షల మొత్తంతో 2500 కుటుంబాలకు సహాయపడాలని తపనతో విజయ్ ఈ మిడిల్ క్లాస్ ఫండ్‌ను ప్రారంభించాడు.
అయితే.. దేవరకొండ ఫౌండేషన్ కు 50 లక్షల రూపాయల విరాళాలు వచ్చాయి. దాంతో ఏకంగా 7500 కుటుంబాలకు సహాయపడ్డారు. ఇప్పటికీ వేలల్లో అప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 70,000 అప్లికేషన్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అందువల్ల విజయ్ ఈ మిడిల్ క్లాస్ ఫండ్ సేవలను ప్రస్తుతానికి నిలిపివేశారు. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా డొనేషన్స్ రూపేణా ఎంత వచ్చింది, ఎంత ఖర్చయింది, ఎంత మొత్తం అవసరార్థులకు వినియోగించారు.
ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనే వివరాలను ఏ రోజుకు ఆ రోజు వెల్లడిస్తూ పారదర్శకతను విజయ దేవరకొండ ఫౌండేషన్ పాటించింది. కేవలం 2500 కుటుంబాలకు సహాయం చేద్దామని విజయ్ ప్రారంభించిన ఈ మిడిల్ క్లాస్ ఫండ్ తో ఇప్పటికీ 7500 కుటుంబాలకు సహాయం అందించడం జరిగింది. అయితే.. ఇంకా 70,000 మంది అవసరార్థులున్నారు. వాళ్ళందరికీ సహాయం అందించాలంటే 7 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్స్‌ను వ్యాలిడేట్ చేసి, వారికి సహాయం అందించడానికి దేవరకొండ ఫౌండేషన్ సభ్యులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రానున్న కాలంలో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా లక్ష మందికి ఉద్యోగ కల్పన దిశగా అడుగులు వేయడం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











