పెళ్లి చూపులు సమయంలోనే మాటిచ్చా.. అందుకే సంపాదించిందంతా ఖర్చు చేశా.. విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కెరీర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ బిజినెస్ రంగంలో కూడా సత్తా చాటుతున్నాడు విజయ్. ఇప్పటికే రౌడీ పేరిట బట్టల వ్యాపారం చేస్తున్న ఆయన 'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో నిర్మాత అవతారమెత్తారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా షూటింగ్ పూర్తిచేశారు. నవంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన విజయ్ దేవరకొండ ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్నారు. తాను 'పెళ్లి చూపులు' సినిమా చేస్తున్న సమయంలోనే డైరెక్టర్ షమ్మీర్ సుల్తాన్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూశానని, వాటికి అట్రాక్ట్ అయి అప్పుడే ఆయనకు సినిమా చేస్తాననే మాటిచ్చానని తెలిపారు. ఆయన చెప్పిన 'మీకు మాత్రమే చెప్తా' కథ బాగా నచ్చడంతో తాను సంపాదించిన దాంట్లో ఎక్కువ మొత్తం సొమ్ము ఈ సినిమాపై వెచ్చించానని విజయ్ దేవరకొండ చెప్పారు. టీమ్ అంతా కష్టపడి నటించారని, ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారనే నమ్మకముందని విజయ్ అన్నారు.

షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించిన 'మీకు మాత్రమే చెప్తా' చిత్రాన్ని విజయ్ దేవరకొండ తన సొంత నిర్మాణ సంస్థ 'కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్‌టైన్మెంట్' పతాకంపై నిర్మించాడు. తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా పరిచయం చేస్తుండటం విశేషం. న్యూ ఏజ్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించింది.


Click it and Unblock the Notifications











