దిగ్బ్రాంతికరం.. విచారకరం.. విజయ నిర్మల మృతిపై చంద్రబాబు, లోకేష్
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ విజయ నిర్మల మరణించారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయ నిర్మల మృతి వార్త సినీ వర్గాలు, అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. విజయ నిర్మల కుటుంబానికి పలువురు సినీ, వ్యాపార, ఇతర పరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ తమ సంతాప ప్రకటనల్లో..
సీనియర్ నటి విజయ నిర్మల గారి మరణం దిగ్బ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథా చిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. వారి అభిమానులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
మహిళా దర్శకురాలిగా విభిన్న చిత్రాలను తెరకెక్కించి, సమున్నత స్థానం సాధించిన ప్రముఖ నటి, హీరో కృష్ణగారి సతీమణి శ్రీమతి విజయ నిర్మల గారి మరణం విచారకరం. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని మాజీ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

కాగా, విజయ నిర్మల భౌతికకాయాన్ని గురువారం (జూన్ 27న) ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్‌కు తీసుకువచ్చి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం గానీ, సాయంత్రంగానీ ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











