విజయ నిర్మల మృతితో షాక్‌లో చిరంజీవి.. కృష్ణ గారికి ఆమె లేని లోటు.. భానుమతి అంత గొప్ప అంటూ..
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ విజయ నిర్మల మరణించారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయ నిర్మల మృతి వార్త సినీ వర్గాలు, అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. విజయ నిర్మల కుటుంబానికి పలువురు సినీ, వ్యాపార, ఇతర పరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి తన సంతాపాన్ని ప్రకటించారు. ఆయన ఏమన్నారంటే..

విజయనిర్మల గారి లాంటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేం. అరుదైన దర్శక నటీమణి శ్రీమతి విజయ నిర్మల గారి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు పరిశ్రమలో భానుమతి గారి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి విజయనిర్మల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు విజయనిర్మల. అంతటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేం.
కృష్ణగారికి జీవిత భాగస్వామినిగా ఎప్పుడూ ఆయన పక్కన నిలబడి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ తన ధర్మాన్ని నెరవేరుస్తూ వచ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కృష్ణగారికి, నరేష్‌కు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
కాగా, విజయ నిర్మల భౌతికకాయాన్ని గురువారం (జూన్ 27న) ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్‌కు తీసుకువచ్చి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం గానీ, సాయంత్రంగానీ ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











