నాన్నగారితో గొప్ప అనుబంధం.. అదే ఆమె మొదటి చిత్రం.. విజయ నిర్మల మృతికి బాలకృష్ణ సంతాపం
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ విజయ నిర్మల మరణించారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయ నిర్మల మృతి వార్త సినీ వర్గాలు, అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. విజయ నిర్మల కుటుంబానికి పలువురు సినీ, వ్యాపార, ఇతర పరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా బాలకృష్ణ తన సంతాపాన్ని ప్రకటించారు. ఆయన ఏమన్నారంటే..
నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న విజయనిర్మలగారు కన్నుమూయడం ఎంతో బాధాకరం. సినీ రంగ పరిశ్రమలో మహిళా సాధికారతను చాటిన అతి కొద్ది మంది మహిళల్లో విజయనిర్మల గారు ఒకరు. నాన్నగారి పాండురంగ మహత్యం సినిమాలో కృష్ణుడిగా నటించారు. అదే ఆవిడ నటించిన తొలి తెలుగు సినిమా. బాలనటి నుంచి హీరోయిన్‌గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు అని బాలకృష్ణ గుర్తు చేసుకొన్నారు.

నాన్ననందమూరి తారక రామారావు గారితో మారిన మనిషి, పెత్తందార్లు, నిండుదంపతులు, విచిత్రకుటుంబం సినిమాల్లో నటించారు. అలాగే దర్శకురాలిగా 44 చిత్రాలను డైరెక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్రసీమకు తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటించారు.
కాగా, విజయ నిర్మల భౌతికకాయాన్ని గురువారం (జూన్ 27న) ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్‌కు తీసుకువచ్చి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం గానీ, సాయంత్రంగానీ ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











