గొప్ప నటి, దర్శకురాలిని కోల్పోయాం.. విజయ నిర్మల మృతిపై మంత్రి శ్రీనివాస్ యాదవ్
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆమె సినీ రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. విజయ నిర్మల ప్రతిభా పాటవాలను కీర్తించారు. విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ భార్య అనే విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ జూన్ 26 తేదీ అర్ధరాత్రి గచ్చిబౌలిలోని ప్రముఖ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు.
1946 ఫిబ్రవరి 20న జన్మించిన విజయనిర్మల..అత్యధిక చిత్రాల్లో కృష్ణ పక్కనే హీరోయిన్‌గా నటించారు. వీరిద్దరూ కలిసి 47 సినిమాల్లో జంటగా నటించారు.
ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా..ఆమె గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నారు.

11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో నటిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన విజయ నిర్మల..రంగుల రాట్నం చిత్రంతో హీరోయిన్ పరిచయం అయ్యారు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.విజయ నిర్మల మరణం తో చిత్ర పరిశ్రమ ప్రముఖ దర్శకురాలు, నటిని కోల్పోయింది.
విజయనిర్మల మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అలాగే ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలి అని మంత్రి తలసాని వేడుకొన్నారు.
కాగా, విజయ నిర్మల భౌతికకాయాన్ని గురువారం (జూన్ 27న) ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్‌కు తీసుకువచ్చి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం గానీ, సాయంత్రంగానీ ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











