కల్యాణ్ రామ్ సినిమాను నాశనం చేస్తారా? క్షమించం .. విజయశాంతి ఆగ్రహం
ఇటీవలి కాలంలో సినిమాలపై నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. సినిమా బాగుండకపోతే ఫెయిల్ కావడం సర్వసాధారణం. కానీ కావాలని దుష్ప్రచారం చేసి సినిమాను తొక్కేయడం ఇండస్ట్రీకి మంచిది కాదనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభిమానుల మధ్య యుద్ధం, తమ హీరో సినిమాకు ఎవరూ అడ్డు నిలవకూడదు అన్నట్లుగా కొందరు ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. మేము బాగానే ఉన్నాం .. మీరు కొట్టుకోవద్దని ఎన్నోసార్లు స్టార్ హీరోలు పిలుపునిచ్చినా కొందరి బుద్ధి మారడం లేదు.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం గేమ్ ఛేంజర్. తమిళ దర్శక దిగ్గజం శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాను నెగిటివ్ పబ్లిసిటీ నిండా ముంచింది. సినిమా బాగున్నప్పటికీ ట్రోలింగ్ దెబ్బకు కలెక్షన్స్ పడిపోయి నిర్మాతకు భారీ నష్టాలు వచ్చాయి. జనం థియేటర్‌కు రావాలని అనుకున్నా నెగిటివ్ టాక్‌తో పాటు రిలీజ్ రోజే ఆయా సినిమాల హెచ్‌డీ ప్రింట్ వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతూ ఉండటంతో దర్శక నిర్మాతలు తలపట్టుకుంటున్నారు.

నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అలనాటి నటి, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కీలకపాత్ర పోషించారు. బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, సయీ మంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్, అశోక్ వర్ధన్, సునీల్ బులుసు, ముప్పా వెంకయ్య చౌదరీలు సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 18న అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తల్లీకొడుకుల ఎమోషన్, సోసైటీలోని పరిస్థితులు, క్రైమ్ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలు, మౌత్‌టాక్‌తో ఆదరణ దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాపై నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్న వారిపై విజయశాంతి ఫైర్ అయ్యారు. బాగున్న సినిమాను బాలేదని.. బాలేని సినిమాను బాగుందని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని రాములమ్మ మండిపడ్డారు.
థియేటర్‌లో సినిమాను చూసిన ప్రేక్షకులు బాగుందని మెచ్చుకుంటున్నారని , తమ సినిమా నచ్చలేదని చెప్పి చిత్రాన్ని చంపేద్దామని కొన్ని దుష్టశక్తులు యత్నిస్తున్నాయని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి సినిమాలను చంపే హక్కు మీకు లేదని.. అలా చేస్తే కొన్ని జీవితాలు పోతాయని రాములమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తాము 40 ఏళ్లకు పైగా సినిమాల్లో కొనసాగుతున్నామని.. కానీ ప్రస్తుత తరం ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి వస్తున్నారని ఆమె తెలిపారు.
మీకు సినిమా నచ్చకుంటే చూడొద్దని, ఎవరైనా మిమ్మల్నికెలుకుతూ మీ మైండ్ వాష్ చేస్తుంటే వారి దగ్గరికి వెళ్లి చెంచాగిరి చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమాను నాశనం చేద్దాం అనుకునేవారిని జీవితంలో క్షమించకూడదని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం విజయశాంతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కళ్యాణ్‌రామ్ మూవీపై ఇలా దుష్ప్రచారం చేయిస్తుంది ఎవరంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











