Jithender Reddy First Look.. అంచనాలు పెంచిన జితేందర్ రెడ్డి పోస్టర్.. బయోపిక్ వెనుక కథ ఏమిటి?
తెలుగు తెరపై వాస్తవ సంఘటనలు, యదార్థ కథలతో సినిమాలు రూపొందిస్తూ ప్రేక్షకులు కొత్తదనం అందించేందుకు యువ దర్శకులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మరుగున పడి ఉన్న కథలను, పాత్రలను వెలికి తీసి తమదైన శైలిలో తమ ప్రతిభను చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
గతంలో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీలతో ఆకట్టుకొన్న విరించి వర్మ తన రూట్ మార్చి చేస్తున్న చిత్రం జితెందర్ రెడ్డి. బయోపిక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో బాహుబలి ఫేమ్ రాకేష్ వర్రే టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేపుతున్నది. ఈ సినిమా వెనుక వివరాల్లోకి వెళితే..

ఏబీవీవీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో కీలక పాత్ర పోషించిన జితేందర్ రెడ్డి అనే యువకుడి కథను విరించి వర్మ తెరకెక్కిస్తున్నారు. తెలంగాణలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన జితెందర్ రెడ్డి తాను నమ్మిన సిద్దాంతం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడని భావోద్వేగమైన కథకు ఆయన తెరరూపం కల్పించారు. ఈ సినిమా సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
భారీ అంచనాలు రేకెత్తిస్తున్న జితేందర్ రెడ్డి సినిమాకు సంబంధించిన హీరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వీరావేశంతో ఓ యువకుడు నడిచి వస్తుండగా దుమ్ము రేగుతూ కనిపించింది. అలాగే పౌరుషాన్ని వెళ్లగక్కుతూ చేతిలో తుపాకీతో ఆవేశంగా కనిపించాడు. విభిన్నమైన పాత్రలో రాకేష్ వర్రే యాటిట్యూడ్, హావభావాలు అందర్నీ ఆకట్టుకొంటున్నాయి. పోస్టర్ చూడగానే మంచి కంటెంట్ ఉన్న చిత్రంగా ఫీల్ కలిగించింది.
జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే గన్ చేతబట్టుకొని వస్తుంటే పోలీస్ ఆఫీసర్ అనే భ్రమను కలిగించాడు. అందుకు ముందు రిలీజ్ చేసిన పోస్టర్‌లో రాజకీయ నేతగా అనే ఫీలింగ్ కల్పించారు. ఇలా విభిన్నమైన గెటప్స్‌తో జితేందర్ రెడ్డిగా క్యూరియాసిటీని పెంచారు. ఆ క్యూరియాసిటీకి తగినట్టుగా అనుభూతిని పొందాలంటే.. ఈ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.
ఇదిలా ఉండగా, జితేందర్ రెడ్డి సినిమాలోని నటీనటులను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వీఎస్ జ్ఞానశేఖర్, మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. నాగేంద్రకుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











