HBD Vishnu Manchu: ఊహించని విధంగా కన్నప్ప ఫస్ట్ లుక్.. అంచనాలు పెంచిన విష్ణు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి పరిచయమైనా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు విష్ణు. కెరీర్ ఆరంభంలోనే పలు హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ హిట్‌ను ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో పని చేస్తూనే ఉన్నాడు.
వరుస ఫ్లాపులతో నిరాశ పరుస్తోన్న మంచు విష్ణు.. ఈ సారి భారీ హిట్‌పై కన్నేశాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు అతడు 'కన్నప్ప' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. మహా శివుడి పరమ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దీన్ని ముకేష్ కుమార్ సింగ్ అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రూపుదిద్దుకుంటోంది.

మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తోన్న 'కన్నప్ప' సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా దీన్ని షూట్ చేస్తూ వస్తున్నారు. ఇలా ఇప్పటి వరకే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు.
టాలెంటెడ్ హీరో మంచు విష్ణు పుట్టినరోజు నేడు (నవంబర్ 23న). దీన్ని పురస్కరించుకుని తాజాగా 'కన్నప్ప' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ వీరుడు బాణం ఎక్కుపెట్టి కనిపించాడు. బ్యాగ్రౌండ్‌లో ఉన్న ప్రకృతి శివలింగం ఆకారంలో కనిపించేలా డిజైన్ చేశారు. మొత్తానికి ఈ పోస్టర్‌లో హీరో ముఖం కనిపించకున్నా.. మూవీపై అంచనాలను పెంచేశారు.
'కన్నప్ప' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసిన హీరో మంచు విష్ణు.. 'కన్నప్ప ప్రపంచంలోకి స్వాగతం. ఇక్కడ ఓ నాస్తిక యోధుడు మహా శివుని పరమ భక్తుడిగా మారడానికి చేసిన ప్రయాణం ప్రాణం పోసుకుంది' అని పేర్కొన్నాడు. మొత్తానికి ఈ చిత్రానికి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఊపిరి పోసింది అని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. 'కన్నప్ప' సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్ బాబు దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ వంటి స్టార్లు అతిథి పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి మణి శర్మ, స్టీఫెన్ సంగీతం ఇస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











