పరాన్న జీవులు.. మా మీద పడి బతుకుతూ.. పెద్దిపై నెగిటివ్ కామెంట్స్‌పై విశ్వక్‌సేన్ ఫైర్
సినిమా హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో సినీరంగం నుంచి ఏది వచ్చినా దానిపై నెగిటివ్ ట్రోలింగ్ అనేది బాగా ఎక్కువైంది. బాగున్న సినిమాలను కూడా బాలేదని ప్రచారం చేయడంతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొందరు పోస్టులు పెట్టడం, నెగిటివ్ కామెంట్స్ చేయడం చేస్తున్నారు. ఇవి తమ దృష్టికి వచ్చినా కొందరు సెలబ్రిటీలు పట్టించుకోవడం లేదు.. మరికొందరు మాత్రం ఘాటుగా చీవాట్లు పెడుతున్నారు. తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌పై యంగ్ హీరో విశ్వక్‌సేన్ సీరియస్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..
ట్రోలింగ్‌పై టాలీవుడ్ సీరియస్
తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, సినిమాలపై ట్రోల్ చేస్తున్న వారిపై మా అసోసియేషన్‌తో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫోకస్ పెట్టింది. ఇలాంటి వారి గురించి ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్తూ వారికి కళ్లెం వేస్తూ వస్తున్నారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇలాంటి ట్రోల్ చేసేవారు, నెగిటివ్ రివ్యూలు రాసేవారు ఏమాత్రం తగ్గడం లేదు.

ఉగాది కానుకగా పెద్ది
గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది చేస్తున్నారు రామ్ చరణ్. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇంకా దివ్యెందు శర్మ, జగపతి బాబు, విజి చంద్రశేఖర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నవంబర్ 7న చికిరి చికిరి సాంగ్ విడుదల
ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా నవంబర్ 7న చికిరి చికిరి సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. బాలాజీ రచించిన ఈ పాటను మోహిత్ చౌహాన్ ఆలపించగా.. ఏఆర్ రెహమాన్ అదిరిపోయేలా స్వరపరిచారు. జానీ మాస్టర్ కంపోజ్ చేయగా రామ్ చరణ్ వేసిన స్టెప్స్, జాన్వీ కపూర్ అందం అన్నీ కలగలిపి చికిరి చికిరి సాంగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. రిలీజైన నాటి నుంచి నేటి వరకు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తోంది. తెలుగు సహా 5 భాషల్లో 150 మిలియన్ల వ్యూస్‌ను అందుకుంది చికిరి చికిరి. రెండు నెలలు కావొస్తున్నా ఈ పాట యూట్యూబ్‌లో టాప్ ట్రెండ్ అవుతూనే ఉంది.
రామ్ చరణ్, పెద్దిపై అలాంటి కామెంట్స్
అలాంటిది ఈ పాటపై కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఆన్‌లైన్‌లో కొందరు కలిసి వీడియో కాల్ మాట్లాడుతూ.. చికిరి చికిరి పాటతో పాటు పెద్ది సినిమాపైనా దారుణంగా కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో విశ్వక్‌సేన్ దృష్టికి రావడంతో ఆయన సీరియస్ అయ్యారు. చిత్ర పరిశ్రమ నుంచి ప్రయోజనం పొందుతూ.. ఇండస్ట్రీని కించపరిచేలా మాట్లాడటం కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఇలాంటి మనుషులను పరాన్నీజీవి అనాలేమో.. ఇండస్ట్రీ ద్వారా తాను, తన కుటుంబం బతుకుతూ ఒక సినిమాను రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి వారి ప్రవర్తన తిని పళ్లెంలో ఉమ్మేసినట్లుగా ఉందని విశ్వక్‌సేన్ మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











