బర్త్ డే రోజునే హీరోగా వినాయక్ మరో జన్మ.. సినిమా ప్రారంభం ఎప్పుడంటే
సినీ పరిశ్రమలో హీరోలు దర్శకులుగా మారడం ఎక్కువగానే కనిపిస్తుంటుంది. కానీ దర్శకులు హీరోగా మారడం చాలా అరుదుగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో టాగోర్, ఆది, అల్లుడు శ్రీను, నాయక్ లాంటి చిత్రాలతో అగ్రదర్శకుడిగా మారిన వీవీ వినాయక్ హీరోగా కనిపించబోతున్నారు. వినాయక్ హీరోగా నటించే సినిమా ఆయన పుట్టిన రోజు అక్టోబర్ 9వ తేదీన ప్రారంభం కానున్నదనేది తాజా సమాచారం.
విజయదశమి పండుగ ఘడియలు ప్రవేశిస్తుండటం, పుట్టిన రోజు కూడా కలిసి రావడంతో వినాయక్ సినిమాకు ముహుర్తం నిర్ణయించినట్టు తెలిసింది. అక్టోబర్ 9న కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమాకు సంబంధించిన ఓ స్టిల్ కూడా మీడియాలో హల్‌చల్ రేపుతున్నది.

భారీ తమిళ చిత్రాల దర్శకుడు శంకర్ శిష్యుడు ఎన్. నరసింహారావు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 'దిల్' రాజు నిర్మాణంలో రూపొందుతోంది. ఇందులో పాత్ర కోసం వీవీ వినాయక్ జిమ్‌లో చెమట చిందుస్తున్నారు. బరువు తగ్గుతున్నారు. 1980 నేపథ్యంలో కథ సాగుతుందనీ, వినాయక్ వయసుకు తగ్గట్టు పాత్ర ఉంటుందని సమాచారం.
గత కొద్దికాలంగా దర్శకత్వ విభాగానికి వినాయక్ దూరంగా ఉంటున్నారు. నిర్మాత సీ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇంటెలిజెంట్ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మరో సినిమా చేయకుండా హీరోగా రూపొందుతున్న సినిమాపై దృష్టిపెట్టారు. నటుడిగా అంతో ఇంతో అనుభవం కూడా వినాయక్‌కు ఉన్న సంగతి తెలిసిందే. టాగోర్ సినిమాలో ఓ భావోద్వేగమైన పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











