Trivikram Srinivas: ఇక సినిమాలకు పనికిరానా ? అమ్మ ఒడిలో తలపెట్టుకుని ఏడ్చా..

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధిస్తూ, కొత్త రికార్డులు నెలకొల్పాయి. కుటుంబ కథలు, భావోద్వేగాలు, వినోదాన్ని సమపాళ్లలో మేళవిస్తూ కథలు చెప్పడంలో ఆయనకు సాటి లేరనే చెప్పాలి. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే ఇంతటి విజయాల వెనుక ఓ బాధాకరమైన క్షణం కూడా ఉందట. ఓ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందనను గమనించిన త్రివిక్రమ్, వచ్చిన నెగటివ్ టాక్‌ను తట్టుకోలేక 'ఇక నేను సినిమాలకు పనికిరానా?' అంటూ మనసులోనే కుంగిపోయారట. ఆ బాధలో తన తల్లి ఒడిలో తల పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇంతకీ ఆ సినిమా ఏది? ఆ రోజు త్రివిక్రమ్ ఎందుకు అంతగా కుంగిపోయారు?

భీమవరం అనే చిన్న ఊరిలోని రెండు గదుల శాఖ గ్రంథాలయం నుంచే త్రివిక్రమ్ ప్రయాణం మొదలైంది. అక్కడి పుస్తకాల ప్రపంచమే ఆయనను మాటల మాంత్రికుడిగా తీర్చిదిద్దింది. బూతులతో నవ్వించడం సులువు కానీ మంచి మాటతో మనిషిని ఒప్పించడం కష్టం అన్న సత్యాన్ని ఆయన తన సినిమాల ద్వారా నిరూపించారు. త్రివిక్రమ్ మాటలు వినోదం మాత్రమే కాదు... జీవితానికి దారి చూపే పాఠాలు. నాన్న కోపంలోనూ ప్రేమను చూపించే డైలాగ్‌లు, స్నేహానికి నమ్మకాన్ని నిర్వచించే మాటలు, సమాజంలో పెరుగుతున్న హింసపై కామన్ మ్యాన్ ఆవేదన .. ఇవన్నీ ఆయన కలం నుంచి వచ్చినవే. రామాయణం, భారతాన్ని ఉదాహరణలుగా తీసుకుని గెలుపు కంటే వదిలేయడమే గొప్పదని, లెక్కలకంటే విలువలే ముఖ్యమని చెప్పగలిగారు.

Trivikram Srinivas Almost Quit Cinema

జీవితంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అన్న ప్రశ్నలకు సమాధానంగా నిలిచే మాటలు ఆయనవి. కష్టాల్లో మైండ్ బ్లాక్ అయినప్పుడు, ఏం చేయాలో తెలియని క్షణాల్లో త్రివిక్రమ్ డైలాగ్‌లు మనల్ని మోస్తాయి, దారి చూపిస్తాయి. అందుకే ఆయన మాటలు కాదు... మన జీవితాల్లో నిలిచిపోయే గురువులాంటి మాటలు. త్రివిక్రమ్ నిజమైన 'మాటల మాంత్రికుడు'. త్రివిక్రమ్ సినిమాలు అంటే కేవలం కథ మాత్రమే కాదు... బలమైన పాత్రలు, జీవితాన్ని తాకే డైలాగులు, ప్రేక్షకుడిని ఆలోచింపజేసే భావాలు. అందుకే ఆయన ఎప్పుడూ స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ, వారి ఇమేజ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా కథలను తీర్చిదిద్దుతుంటారు. అందుకే ఆయనను గురూజీ అంటారేమో..

ఇక త్రివిక్రమ్ కెరీర్ లో స్పెషల్ మూవీ 'నువ్వు నాకు నచ్చావ్'. వెంకటేష్‌, ఆర్తి అగర్వాల్‌ జంటగా నటించిన ఈ సినిమా కే. విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందింది. కథ, మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించగా, స్రవంతి రవి కిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2001 సెప్టెంబర్‌ 6న విడుదలైన ఈ సినిమా, అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా, విడుదలైన రోజుల్లోనే సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రూ.18 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్ సాధించి, పెట్టుబడికి మూడింతల లాభాలను తెచ్చిపెట్టింది.

అప్పట్లో తెలుగు సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలవడం విశేషం. అంతేకాదు, ఈ మూవీ 93 సెంటర్లలో 50 రోజులు, 57 సెంటర్లలో 100 రోజులు, మూడు సెంటర్లలో 175 రోజులు ప్రదర్శితమై ఘన విజయం సాధించింది. ఈ మూవీ వెంకటేష్ కెరీర్‌లోనే బెస్ట్ కామెడీ ఫిల్మ్‌గా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన కామెడీ టైమింగ్, సహజ నటన, ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాలో పీక్‌లో కనిపిస్తాయి. ముఖ్యంగా వెంకీ - ఆర్తి అగర్వాల్ లవ్ ట్రాక్ ఆడియెన్స్‌ను మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకుంటుంది. నవ్విస్తూనే, చివరికి ఎమోషనల్‌గా తాకే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.

ఈ సూపర్ హిట్ వెనుక ఓ ఆసక్తికరమైన, బాధాకరమైన కథ ఉందని చాలా మందికి తెలియదు. 'నువ్వు నాకు నచ్చావ్' విడుదలైన మొదటి రోజు వచ్చిన పబ్లిక్ టాక్ త్రివిక్రమ్‌ను తీవ్రంగా నిరాశపరిచిందట. ఈ విషయాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. 'సినిమా రిలీజైన రోజు భీమవరం వెళ్లిపోయాను. సంతాపసభలో ఉన్నోడిలా అనిపించింది. సినిమా చూసి బయటకు వచ్చిన ఓ వ్యక్తిని రివ్యూ అడిగితే, 'రెండు మూడు వారాలు ఆడుతుంది' అన్నాడు. దీంతో వెంటనే ఇంటికి వెళ్లి మా అమ్మ ఒడిలో తల పడుకుని ఏడ్చా.. 'ఈ సినిమాలకు నేను పనికిరానేమో... ఈ ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశాను. ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుండేదేమో' అన్నాను. మా అమ్మ బెంబేలెత్తిపోయింది' అని త్రివిక్రమ్ గుర్తు చేసుకున్నారు.

అయితే ఇక్కడే కథ మలుపు తిరిగిందట. నిర్మాత స్రవంతి రవికిశోర్ త్రివిక్రమ్‌కు ఫోన్ చేసి హైదరాబాద్ రావాలని చెప్పారు. ఆయనను నేరుగా శాంతి థియేటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ టికెట్లు తెగిపోతున్న దృశ్యం చూసిన తర్వాతే త్రివిక్రమ్‌లో ధైర్యం వచ్చింది. 'చెమటతో ఒళ్లు తడిచిపోయింది. ఆడియెన్స్ స్పందన చూసాకే నాకు నమ్మకం వచ్చింది' అని త్రివిక్రమ్ తెలిపారు. ఆ ఒక్క రోజు ఆయన ఆలోచననే మార్చేసిందని నిర్మాత వెల్లడించారు. అలాగే.. 'ఈ సినిమా క్రెడిట్ మొత్తం వెంకటేష్‌దే. స్క్రిప్ట్ విన్న వెంటనే ఆయన ఎలాంటి సందేహం లేకుండా ఓకే చెప్పారు. అది ఆయన నుంచి నాకు ఫస్ట్ టైమ్ అనుభవం. ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా టెన్షన్ పడ్డాను' అని త్రివిక్రమ్ తెలిపారు.

హిస్టరీని క్రియేట్ చేసిన ఈ మూవీ జనవరి 1న 'నువ్వు నాకు నచ్చావ్' 4కే వెర్షన్‌లో మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. 25 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా మ్యాజిక్ కొనసాగుతుందా? కొత్త తరం ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే, 'నువ్వు నాకు నచ్చావ్' కేవలం ఓ సూపర్ హిట్ సినిమా మాత్రమే కాదు... త్రివిక్రమ్ జీవితాన్ని మలుపుతిప్పిన టర్నింగ్ పాయింట్. మొదటి రోజు టాక్‌తో కుంగిపోయిన రచయిత, ఆడియెన్స్ స్పందనతో తిరిగి నిలబడి, తర్వాత మాటల మాంత్రికుడిగా ఎదిగిన ప్రయాణానికి ఈ సినిమా పునాది వేసిందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X