తెరపైకి ఓ వీరుడిగాథ, అల్లు అరవింద్ డ్రీమ్ ప్రాజెక్ట్ .. ఎవరీ కోడి రామ్మూర్తి నాయుడు?
మన చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఆధారంగానే మేకర్స్ సినిమాలు తీస్తున్నారు. ఈ కోవలోనే జీవితంలో గొప్ప స్థాయికి చేరుకున్న వ్యక్తుల జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కుతోన్న బయోపిక్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. సినీ, క్రీడా, రాజకీయ, సామాజిక సేవ, శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించి , భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులను సాధించి పెట్టిన వ్యక్తుల బయోపిక్స్‌ను సినీ పరిశ్రమ తెరకెక్కిస్తోంది.
గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం సాధించింది. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార కుటుంబాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను చందూ మొండేటీ తెరకెక్కించారు. దేశభక్తి, లవ్, ఎమోషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టేసిన ఈ సినిమా లాభాల దిశగా పరుగులు తీస్తోంది.

చాలా రోజుల తర్వాత తమ కుటుంబం నుంచి ఓ హీరో హిట్ కొట్టడంతో అక్కినేని నాగార్జున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్ర సక్సెస్‌మీట్‌కు స్వయంగా హాజరై చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. పైరసీ వీడియోలు, హెచ్‌డీ ప్రింట్ లీక్ అయినా తండేల్‌కు కలెక్షన్స్ అదిరిపోవడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. తాజాగా శ్రీకాకుళంలో తండేల్ థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగచైతన్య, సాయిపల్లవి, చందూ మొండేటి, అల్లు అరవింద్, బన్నీ వాసు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడి జీవితం, ఆయన సాధించిన విజయాలను ప్రస్తావించారు. కోడి రామ్మూర్తి నాయుడు జీవితంపై బయోపిక్ తీయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న అల్లు అరవింద్ ఇప్పటికే ఆయన జీవిత చరిత్రను స్టడీ చేశామన్నారు. ఎప్పటికైనా రామ్మూర్తి నాయుడుపై సినిమా గానీ, వెబ్ సిరీస్ గానీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు కోడి రామ్మూర్తి నాయుడు ఎవరు? ఆయన సాధించిన విజయాలు ఏంటి? అనే దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

వీరఘట్టంకు చెందిన రామ్మూర్తి నాయుడు 1883 నవంబర్ 3 జన్మించారు. చిన్నప్పటి నుంచే వ్యాయామంపై మక్కువ పెంచుకున్న ఆయన అందులో రాటుదేలారు. మద్రాస్‌లో వ్యాయామ కళాశాలలో చదువుకున్న రామ్మూర్తి నాయుడు తాను చదువుకున్న కళాశాలకే వ్యాయామ ఉపాధ్యాయుడిగా చేరారు. వ్యాయామంతో పాటు వాయు స్తంభన, జలస్తంభన , యోగాలో రామ్మూర్తి నాయుడు నిష్ణాతుడు. తర్వాత ఓ సర్కస్ కంపెనీ మొదలుపెట్టిన ఆయన తన గుండెలపై ఒకటిన్నర టన్నుల బరువును మోసి షాకిచ్చారు. ఏనుగును ఛాతీ మీద ఎక్కించుకోవడం, ఇనుప గొలుసులను తనకు కట్టి కార్లతో లాగించడం వంటి విన్యాసాలకు జనం షాకయ్యేవారు. భారత్‌తో పాటు చైనా, జపాన్, బర్మా వంటి దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో బర్మాలో రామ్మూర్తి నాయుడుపై హత్యాయత్నం జరగడంతో విదేశాల్లో ప్రదర్శనలు నిలిపివేశారు. శాకాహారి అయన ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు, అంతేకాదు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. 1942లో 59 ఏళ్ల వయసులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. తన సంపాదనలో ఎక్కువ భాగం విరాళాలు ఇవ్వడంతో పాటు భారత స్వాతంత్య్ర పోరాటానికి కూడా ఎంతో సాయం చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. కలియుగ భీముడు, జగదేకమల్లుడు, ఇండియన్ హెర్కులిస్, మల్లమహామార్తాండ, ఇండియన్ శాండో, ఆధునిక భారత సర్కస్ పితామహుడిగా రామ్మూర్తి నాయుడిని ప్రజలు పిలుచుకుంటారు. అలాంటి వ్యక్తి జీవితగాథను అల్లు అరవింద్ బయోపిక్‌గా తీయాలని నిర్ణయించడంపై ఆయన అభిమానులు, ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











