‘టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు దూరంగా.. కారణం ఎవరంటే?’
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా మారిపోయాయి. ఎవరి వ్యూహాలకు వారు పదను పెడుతున్నారు. జనసేన పార్టీకి మెగా హీరోలు మద్దతు తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చిన్న ఆర్టిస్టులు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దూరం కావడం చర్చనీయాంశమయ్యాయి. అయితే తాజాగా టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరగా, ప్రచారంలో నేతలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చావోరేవోగా అభివర్ణిస్తున్న ఈ ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు నాయుడు అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. ఎలాంటి ప్రయోగాలకు తావు లేకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బీజేపీ, జనసేనలతో కలిసి కూటమిగా జట్టు కట్టారు.

అయితే తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ దూరం కావడానికి చంద్రబాబే కారణమంటున్నారు ఆయన సన్నిహితుడు , గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ప్రముఖ తెలుగు వార్తా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, జూనియర్ ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌తో పనిచేయించుకుని తర్వాత ఆయనను దూరం పెట్టారని వంశీ ఆరోపించారు.
2009 ఎన్నికల సమయానికి ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో వున్నారని .. అయినప్పటికీ ఆయన భవిష్యత్‌ను పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశారని వంశీ పేర్కొన్నారు. చివరికి యాక్సిడెంట్ జరిగి.. చావు అంచుల వరకు వెళ్లారని గుర్తుచేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కకు తోసేశారని .. ఆయనపై కొన్ని పత్రికల్లో తప్పుడు రాతలు రాయించారని మండిపడ్డారు. ఎన్టీఆర్ వెళ్లిన మార్గాలు ఇవీ.. ఏయే వూర్లు తిరిగాడు అని గీతలు గీసి, ఆ ఏరియాల్లో టీడీపీ ఓడిపోయిందని రాశారని వంశీ ఆరోపించారు.

అంటే పార్టీకి ఆయన పనికిరాడని వార్తలు రాయించి, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని .. అంత దారుణంగా జూనియర్ ఎన్టీఆర్‌ను అవమానించారని వంశీ తెలిపారు. తనకు తానే పార్టీకి, రాజకీయాలకు దూరంగా వుండే పరిస్ధితిని ఎన్టీఆర్‌కు కల్పించారని మండిపడ్డారు. ఆ తర్వాత కొడాలి నాని టీడీపీకి దూరమయ్యారని.. తాను కొన్నేళ్లు వుండాల్సి వచ్చిందని వల్లభనేని వంశీ అన్నారు.
నారా లోకేష్ తన మనుషులనే పార్టీలో చుట్టూ పెట్టుకుంటున్నారని.. అక్కడ ఇమడలేకనే తాను తెలుగుదేశాన్ని వీడానని చెప్పారు. తెలుగుదేశం పార్టీని నారా లోకేష్‌ను అప్పగించేందుకు చంద్రబాబు నాయుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తండ్రి తర్వాత కొడుకు అన్నట్లుగా వారసత్వాన్ని అప్పగించాలని తపించిపోతున్నారని వంశీ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ, రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై టీడీపీ కేడర్, ఎన్టీఆర్ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











