బాలయ్య బాలీవుడ్ ఎంట్రీని అడ్డుకుందెవరు? .. నటసింహానికి ఆ రికార్డు లేకుండా
అన్న నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగు తెరపై అడుగుపెట్టి అనతి కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి బాలకృష్ణ. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక , సోషియో ఫాంటసీ, ఫిక్షన్ సినిమాలతో పాటు ఈ తరంలో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. సినిమాలతో పాటు తండ్రి బాటలోనే రాజకీయాల్లో ప్రవేశించి హిందూపురం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ సక్సెస్ అయిన అరుదైన నటుడిగా నిలిచారు బాలయ్య.
తన తల్లి పేరిట నెలకొల్పిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు బాలకృష్ణ. బాలయ్య ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆసుపత్రి రూపురేఖలు మారిపోయాయి. అత్యాధునిక వైద్య సేవలతో పాటు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు బాలకృష్ణ. త్వరలో అమరావతిలోనూ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించాలని బాలయ్య పట్టుదలతో ఉన్నారు. సినీ, రాజకీయ, సామాజిక రంగాలకు ఆయన చేస్తున్న సేవలకు గాను ఈ ఏడాది రిపబ్లిక్ డేను పురస్కరించుకుని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఇక నుంచి ఆయన పద్మభూషణ్ బాలకృష్ణ.

ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఎవ్వరూ లేనంత స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు బాలయ్య. అఖండ 2, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలతో హ్యాట్రిక్ అందుకున్న బాలకృష్ణ.. ఈ ఏడాది డాకు మహారాజ్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2లో నటిస్తున్నారు . దసరా లేదా సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్. బోయపాటి శ్రీను మూవీ ముగిసిన తర్వాత మరో అగ్ర దర్శకుడి దర్శకత్వంలో నటించేందుకు బాలయ్య సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా టాక్.
50 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నా.. కోట్లాది మంది అభిమాన గణం ఉన్నా , అన్ని రకాల పాత్రలు చేసినా బాలయ్య కెరీర్‌లో ఓ లోటుంది. నిన్న , మొన్న వచ్చిన యువ హీరోలు కూడా హిందీ చిత్ర పరిశ్రమలో అంతో ఇంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ బాలయ్యకు ఇది లోటుగా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్య తోటి హీరోలైన చిరంజీవి , నాగార్జున, వెంకటేష్‌లు ఒకటీ ఆరా చిత్రాలతో హిందీలో అంతో ఇంతో గుర్తింపు తెచ్చుకున్నారు . కానీ బాలకృష్ణకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు.
అయితే బడా ప్రొడ్యూసర్ ఏ ఎం రత్నం .. బాలయ్యను ఎలాగైనా బాలీవుడ్‌లో అడుగుపెట్టించాలని ట్రై చేశారు. ఆ సమయంలో తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేసిన దర్శకుడు ఎన్ చంద్రను ఇందు కోసం ఒప్పించారు కూడా అలాగే.. బాలయ్య, చంద్ర, రత్నం స్టోరీ డిస్కషన్ కోసం సిట్టింగ్స్ కూడా వేశారు. అప్పట్లో వరుసగా మాస్ చిత్రాలతో ఊపు మీదున్న బాలయ్యకు జోడీ ఎవరనే చర్చ జరగ్గా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌ను ఎంపిక చేశారు.
అంతకు ముందే చిరు, నాగ్, వెంకీల సినిమాల కోసం ఆమెను సంప్రదించగా బిజీ కారణంగా ఆమె నో చెప్పారు. అయితే దర్శకుడు చంద్ర తనకు సన్నిహితుడు కావడంతో ఆయన కోసం బాలయ్య సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మాధురీ. స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత మాధురీ, చంద్రలు ఇతర సినిమాలతో బిజీ కావడంతో బాలయ్య సినిమాను పక్కనపెట్టేశారు. దీంతో బాలకృష్ణను హిందీ చిత్ర సీమకు పరిచయం చేయాలనుకున్న ఏఎం రత్నం కోరిక కలగానే మిగిలిపోయింది.


Click it and Unblock the Notifications











