బాలయ్య 50 ఇయర్స్ ఈవెంట్‌కు నాగార్జున దూరం? ఎందుకంటే?
తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ల లాంటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లు కెరీర్ ప్రారంభం నుంచి చనిపోయేవరకు సొంత అన్నదమ్ముల్లా మెలిగారు. అక్కినేని తల్లిగారు ఎన్టీఆర్‌ను తన పెద్ద కుమారుడంటూ మురిసిపోయేవారని చాలా సందర్భాల్లో ఏఎన్ఆర్ చెప్పుకొచ్చారు. ఎంతటి ప్రాణ స్నేహితులైనా అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు సహాజమే. అలాగే ఎన్టీఆర్ - ఏఎన్ఆర్‌ల మధ్య కొందరు పుల్లలు పెట్టి విభేదాలు సృష్టించారు. ముఖ్యంగా అన్నగారు రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు ఇలాంటి పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. అయితే కొద్దికాలానికే ఈ ఇద్దరు పెద్దలు కలిసిపోయారు.
తమ తండ్రుల అడుగుజాడల్లోనే వారి పిల్లలు బాలకృష్ణ, నాగార్జున సైతం నడిచి సోదర భావంతో మెలిగారు. రెండు కుటుంబాల్లోని వ్యక్తులు ఇప్పటికీ అన్నదమ్ముల్లానే కలిసిమెలిసి ఉంటారు. ఒకరి ఇంట్లో మంచి చెడుకు మరొకరు వస్తూ పోతూ ఉంటారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ నాగ్ - బాలయ్య మధ్య గ్యాప్ వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు చనిపోతే మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ అన్నపూర్ణ కాంపౌండ్‌కు తరలివెళ్లింది. అలాంటిది తాను తండ్రి తర్వాత తండ్రిలా అభిమానించే బాబాయ్‌ని చివరిచూపు కూడా చూడలేదు బాలయ్య.

దీనికి ఫలానా కారణం ఇది అని ఏది ఇప్పటికీ తెలియదు. ఏం లేకపోతేనే ఏదేదో రాసేసే మన సోషల్ మీడియా మిత్రులు.. నాగ్- బాలయ్య మధ్యలో దూరి ఏదేదో రాసుకుంటూ వచ్చారు. ఎన్నోసార్లు వీరు కలుస్తారని ప్రచారం జరిగినా.. అవి గాలివార్తలుగానే మిగిలిపోయాయి. వీరిద్దరి మధ్య పలువురు సినీ పెద్దలు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించగా వర్కవుట్ కాలేదని టాక్. నాగార్జున - బాలయ్యలను ఒకే వేదికపై చూసి చాలా ఏళ్లే అవుతోంది. బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న అన్‌స్టాపబుల్ సీజన్ -3ని నాగార్జునతోనే మొదలుపెట్టాలని అల్లు అరవింద్ డిసైడ్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అదే జరిగితే అక్కినేని, నందమూరి అభిమానులకు కావాల్సింది ఏముంది. దీనిపైనా అఫిషీయల్‌గా అనౌన్స్‌మెంట్ లేదు.
అయితే నాగార్జున- బాలకృష్ణ కలిసేందుకు విధి మరోసారి అవకాశం కల్పించింది. సినీనటుడిగా బాలయ్య కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో మెగా ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మొత్తం తరలిరానుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో పాటు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ , మలయాళ స్టార్ హీరోలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారని ఫిలింనగర్ టాక్.

దీనిలో భాగంగా నాగార్జునకు కూడా ఇన్విటేషన్ వెళ్లింది. అయితే ఆయన వెళ్తారా, లేదా అంటూ జనంలో చర్చ నడుస్తోంది. సెప్టెంబర్ 1న బాలయ్య ఈవెంట్ జరిగే సమయంలోనే స్టార్ మాలో నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ ఉంది. దీనిని ఎప్పుడూ ముందుగానే షూట్ చేసి టెలికాస్ట్ చేస్తారు, కొన్ని సందర్భాల్లో లైవ్ కూడా ఉండొచ్చు. ఈ పనుల్లో నాగార్జున బిజీగా ఉండటం, షూటింగ్, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా బాలయ్య 50 ఇయర్స్ ఈవెంట్‌కు నాగ్ వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన వీలు చూసుకుని వెళ్లి బాలకృష్ణతో చేయి కలిపితే మాత్రం గత కొన్నేళ్లుగా నడుస్తోన్న కోల్డ్ వార్‌కు తెరపడినట్లే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











