రాజమౌళి ఉచ్చులో ఎన్టీఆర్ చిక్కడా? .. దేవర ఆ సెంటిమెంట్ అధిగమిస్తుందా?
సక్సెస్ వెంట పరుగులు తీసే చిత్ర పరిశ్రమలో నటీనటులు, దర్శక నిర్మాతలు కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతారు.వీటిని కొందరు మూఢ నమ్మకాలు అనుకున్నా.. మరొకటి అనుకున్నా చివరికి కావాల్సింది సక్సెస్. ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్స్ కొందరికి భయం కలిగిస్తాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించి దేవర రిలీజ్ నేపథ్యంలో దశాబ్ధాలుగా టాలీవుడ్ హీరోలను వణికిస్తోన్న ఓ సెంటిమెంట్ బాగా ట్రెండ్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
తన సినిమాలు, టేకింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీలతో తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతీని తీసుకొచ్చారు. కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డ్‌ను సాధించుకొచ్చారు ఎస్ఎస్ రాజమౌళి. కెరీర్‌లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా జక్కన్న తన పేరిట చరిత్ర లిఖించుకున్నారు. సమీప భవిష్యత్తులో ఆ రికార్డును ఛేదించేవారు కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో జక్కన్న ఉన్నారు.

ఇంతటి ఘనకీర్తిని సాధించిన రాజమౌళి.. తన పేరిట ఓ అప్రతిష్టను కూడా మూటకట్టుకున్నారు. అదేంటంటే.. జక్కన్న సినిమాలో నటించి హిట్ కొట్టిన హీరోకి తన తర్వాతి సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతోంది. ఒకటి రెండు సార్లు అయితే పర్లేదు కానీ , నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోలు రాజమౌళి సెంటిమెంట్‌కు బలయ్యారు. జక్కన్న ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన 'సుబ్బు డిజాస్టర్‌గా నిలిచింది. మళ్లీ రాజమౌళి - ఎన్టీఆర్ కలయికలో వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయగా.. ఆ తర్వాత తారక్ నటించిన ఆంధ్రావాలా ఫ్లాప్ అయ్యింది.
సై హిట్ కాగా.. ఆ వెంటనే నితిన్ నటించిన అల్లరి బుల్లోడు ఫ్లాప్ అయ్యింది. ప్రభాస్‌తో తీసిన ఛత్రపతి బ్లాక్‌బస్టర్ కాగా.. డార్లింగ్ నెక్ట్స్ మూవీ పౌర్ణమి డిజాస్టర్‌గా నిలిచింది. రవితేజతో విక్రమార్కుడు హిట్ కాగా.. మాస్ మహారాజా తర్వాతి చిత్రం ఖతార్నక్ రోజుల వ్యవధిలోనే దుకాణం సర్దేసింది. మరోసారి ఎన్టీఆర్‌తో జతకట్టిన రాజమౌళి యమదొంగ తీయగా.. తారక్ నెక్ట్స్ మూవీ కంత్రి ఫ్లాప్ అయ్యింది. మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీ ఆరెంజ్‌తో డిజాస్టర్‌ను ఎదుర్కొన్నారు.

మర్యాదరామన్నతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్న సునీల్ తర్వాత కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తన తదుపరి మూవీ సాహోతో పరాజయాన్ని అందుకున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్‌తో పాన్ వరల్డ్ హీరోలలో ఒకరిగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్.. దేవరతో ప్రేక్షకుల ముందుకు రావడంతో తారక్ మరోసారి రాజమౌళి సెంటిమెంట్‌కు బలవుతాడా లేక కొత్త చరిత్ర సృష్టిస్తాడా అంటూ చర్చ జరుగుతోంది.
అయితే అలాంటి భయాలేవీ పెట్టుకోవద్దని అంటున్నారు తారక్ ఫ్యాన్స్ . దేవర రిలీజైన నాటి నుంచి పాజిటివ్ రివ్యూలు, మంచి మౌత్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యూపెన్సీతో దేవర దూసుకెళ్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లలో దుమ్మురేపిన ఎన్టీఆర్.. అమెరికాలో కేవలం ప్రీ సేల్స్‌తోనే 3 మిలియన్లకు పైగా రాబట్టాడు. తొలి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ లభిస్తాయని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వీకెండ్ గడిస్తే కానీ దేవర బండారం బయటపడదు. అప్పుడు కానీ ఎన్టీఆర్ .. రాజమౌళి సెంటిమెంట్‌ని బ్రేక్ చేశాడా లేక బొక్కబొర్లా పడ్డాడా అన్నది తెలియదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











