విష్ణు ప్రియకు బిగుస్తున్న ‘బెట్టింగ్’ కేసు ఉచ్చు.. తెరపైకి మంచు లక్ష్మీ వీడియో!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ప్రభావంతో యువత ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్లర్లపై కేసు నమోదు చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు సుమారుగా 11 మంది యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. కేసులు నమోదు చేసిన వారిలో బిగ్ బాస్ సెలబ్రిటీ విష్ణు ప్రియ, సురేఖవాణి కూతురు సుప్రీత, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, హర్ష సాయి, రీతు చౌదరి, సన్నీ యాదవ్,టేస్టీ తేజ, యాంకర్ శ్యామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..
ఓ సిటిజెన్ ఇచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకొని సినీ తారలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేశాం. మొత్తం 11 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేశాం. ఎవరైతే ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారో వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశాం అని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.

సాధారణ ప్రజలకు భారీగా డబ్బు సంపాదించవచ్చు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఆస్తులు కూడబెట్టుకోవచ్చు అంటూ సోషల్ మీడియా ద్వారా వీడియోలు పోస్టు చేసిన వారిపై కొరడా ఝుళిపించాం. పంజగుట్టా, అమీర్ పేట్ ఏరియాలో చాలా హాస్టల్స్ ఉన్నాయి. చాలా మంది యువకులు ఇక్కడ ఉంటారు. గ్రామాల నుంచి ఉద్యోగం, ఉపాధి కోసం యువతీ, యువకులు వస్తుంటారు. వారిని సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌ల గురించి ప్రమోట్ చేస్తూ వారిని ఎట్రాక్ట్ చేసే ప్రమాదం ఉంది. క్రికెట్ సీజన్‌లో బెట్టింగులకు పాల్పడి చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారని ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. దాంతో తాము కొందరిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని ఆయన అన్నారు.
సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేకంగా బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించే విధంగా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొంటాం. ఇలాంటి పనులు చేయడం చట్టరీత్య నేరం, అక్రమం అని డీసీపీ చెప్పారు. కేసు నమోదు చేశాం. సాక్ష్యాలను సేకరిస్తున్నాం. కేసు నమోదు చేసిన వారిని ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తాం. వారు చేసిన నేర తీవ్రతను బట్టి అరెస్ట్ చేస్తాం అని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.
ఇమ్రాన్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రభావంతో కొందరు బెట్టింగ్‌కు పాల్పడి ఆత్మహత్యలు చేసుకొన్నారనే విషయం చర్చనీయాంశమైందనే విషయం మా దృష్టికి వచ్చింది. ఈ బెట్టింగ్ పాల్పడి డబ్బులు కోల్పోయారనే వాస్తవం. కొందరు సూసైడ్ చేసుకొన్నారనే విషయం మీడియా ద్వారా తెలిసింది. పరేషన్ బాయ్స్ అనే పేరుతో ఇమ్రాన్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా గలీజ్ వీడియోలు పోస్టు చేశారు. చిన్న పిల్లలను కూడా వాడుకొన్నట్టు మా దృష్టికి వచ్చింది. చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ సబ్ స్క్రైబ్ పెంచుకొని డబ్బు సంపాదించారు. ఇమ్రాన్ అనే వ్యక్తి మీద కూడా క్రిమినల్ కేసు నమోదైంది అని డీసీపీ వెల్లడించారు.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో బిగ్ బాస్ తెలుగు ఫేమ్ విష్ణు ప్రియకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాట్సప్ ద్వారా నోటీసులు అందజేశామని, ఆమెను మంగళవారం 4 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరాం అని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అలాగే మంచు లక్ష్మీ కూడా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వెలుగు చూసింది. ఎవరెవరూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారనే విషయంపై సమాచారాన్ని సేకరిస్తున్నాం అని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











