శ్రీలీలకు అంత సీన్ లేదు .. 100 కోట్ల సినిమాపై స్టార్ రైటర్ షాకింగ్ కామెంట్స్
వరుస ఫ్లాపులతో అల్లాడుతున్న మాస్ మహారాజ్ రవితేజ తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి తను నిలబడటానికి కారణమైన సినిమా ధమాకా. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు, యూత్ ఫుల్ చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ధమాకా.. రవితేజ కెరీర్‌లో తొలి 100 కోట్ల చిత్రంగా నిలిచింది. దాదాపు మూడేళ్లు కావొస్తున్నా ఈ సినిమా ప్రభావం నేటికీ చూపిస్తూనే ఉంది.
ధమాకా చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్‌లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అప్పటికీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిపెళ్లి సందD సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలను ఈ సినిమాలో తీసుకోవడం చర్చనీయాంశమైంది. కారణంగా రవితేజ.. శ్రీలీల మధ్య ఉన్న ఏజ్ గ్యాప్. వీరిద్దరి మధ్య దాదాపు 37 ఏళ్ల వయసు తేడా ఉండటంతో పలువురు నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక వీరిద్దరి జోడీకి ప్రేక్షకులు 100కి 100 మార్కులు వేసి బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టారు.

ఇక ఈ చిత్రంలో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి వంటి తదితరులు కీలక పాత్రలు పోషించగా.. భీమ్స్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని కామెడీ స్కిట్స్ ను జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది రాశారు. 2022 డిసెంబర్ 23న రిలీజైన ఈ సినిమాలోని పాటలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా పల్సర్ బైక్ పాట మాస్‌ని ఒక ఊపు ఊపింది. యూట్యూబ్‌లో నేటికీ 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
శ్రీలీల నటనకు, ఆమె వేసిన స్టెప్పులకు యూత్ ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాతే శ్రీలీలకు స్టార్ డమ్ వచ్చి టాలీవుడ్‌లో మరింత బిజీ అయ్యారు. ఇక అప్పటి నుంచి వరుసపెట్టి స్కంధ, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డనరీ మ్యాన్, గుంటూరు కారం, పుష్ప 2 ది రూల్ చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా నిలిచారు. ప్రస్తుతం రాబిన్ హుడ్, మాస్ జాతర, పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.

అలాంటి శ్రీలీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ధమాకా చిత్ర రచయిత బెజవాడ ప్రసన్నకుమార్. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ధమాకా సినిమా విజయం సాధించడానికి ఇందులోని పాటలు, శ్రీలీల డ్యాన్సులు కారణమా అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ప్రసన్నకుమార్ స్పందిస్తూ.. కేవలం హీరోయిన్ గ్లామర్, డ్యాన్సుల వల్ల సినిమాలు ఆడవని తేల్చేశారు. ఒక సినిమాలో పాటలు 20 నిమిషాలు మాత్రమే ఉంటాయని ఆ కాస్త ఫీలింగ్‌కు సినిమాలు ఆడవని, మిగిలిన 2 గంటల సినిమా బాగుంటేనే ప్రేక్షకుడికి నచ్చుతుందని ప్రసన్న కుమార్ చెప్పారు.
కథా, కథనాలు బాగుంటే దానికి హీరోయిన్ అందాలు, డ్యాన్స్‌లు, పాటలు బోనస్ అన్నారు. ధమాకా తర్వాత శ్రీలీల పలు చిత్రాలు చేసిందని.. అందులోనూ అందంగా కనిపించి అద్భుతంగా డ్యాన్స్ వేసిందని మరి అవన్నీ హిట్టయ్యాయా అని ప్రసన్నకుమార్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











