సినీ రంగంలో మరో దుర్ఘటన.. సూపర్ హిట్ మూవీల రైటర్ కన్నుమూత
సినీ రంగంలో విషాదకర సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పలు చిత్ర పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు ప్రాణాలు విడిచారు. మూడు రోజుల క్రితమే ప్రముఖ నటుడు డానియెల్ బాలాజీ మరణించారు. ఈ ఘటన మరువక ముందే ఇప్పుడు సినీ రంగంలో మరో దుర్ఘటన జరిగింది. సుదీర్ఘ కాలంగా సినిమా డైలాగ్ రైటర్‌గా సేవలు అందిస్తోన్న శ్రీ రామకృష్ణ (74) తాజాగా మరణించారు. దీంతో దక్షిణాది సినీ రంగంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఫేమస్ డైలాగ్ రైటర్ శ్రీ రామకృష్ణ వయసు మీద పడడంతో కొంత కాలంగా వృద్దాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇలా చాలా రోజులుగా మంచానికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోన్న సమయంలోనే అంటే సోమవారం రాత్రి శ్రీ రామకృష్ణ పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు అత్యవసర చికిత్సను కూడా అదించారు. అయినప్పటికీ ఆయన తుది శ్వాసను విడిచారు. శ్రీ రామకృష్ణ మరణంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ రామకృష్ణ దాదాపు నలభై ఏళ్ల క్రితమే సినిమాలకు డైలాగ్ రైటర్‌గా పరిచయం అయ్యారు. ముఖ్యంగా తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయిన ఎన్నో సినిమాలకు ఆయన సంభాషణలు అందించారు. వాటిలో 'బొంబాయి', 'జెంటిల్‌మెన్', 'చంద్రముఖి', 'దర్భార్' వంటి ఎన్నో సూపర్ హిట్ మూవీలు ఉన్నాయి. అంతేకాదు, శ్రీ రామకృష్ణ 'బాలమురళీ ఏంఏ', 'సమాజంలో స్త్రీ' వంటి చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇలా మొత్తంగా 300 చిత్రాలకు పైగా ఆయన పని చేశారు.
ఇదిలా ఉండగా.. శ్రీ రామకృష్ణ గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. అయితే, 50 ఏళ్ల క్రితమే చెన్నై వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అక్కడి నుంచి తన సినిమా కెరీర్‌ను కొనసాగిస్తూ వచ్చారు. శ్రీ రామకృష్ణకు భార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. ఇక, ఆయన అంత్యక్రియలు మంగళవారం సాలి గ్రామంలో జరగనున్నాయి.


Click it and Unblock the Notifications











