హీరో నాని ఎవరు? బైక్ అమ్మి పవన్ కళ్యాణ్ సినిమాకి కటౌట్ లు కట్టా: వైసీపీ మంత్రి సీరియస్
టాలీవుడ్ సినిమా ప్రపంచంలో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ థియేటర్స్ భవిష్యత్తు చాలా సందిగ్దతలో ఉంది అనే చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా సినిమా టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉండటంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి ఇలాంటి టికెట్ల రేట్లతో సరైన ప్రాఫిట్స్ అందుకోవడం కష్టం గానే ఉంటుంది అని, ఇలానే కొనసాగితే సినిమా థియేటర్లు మూసుకోవాల్సి ఉంటుందని చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రీసెంట్ గా నాని చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.

చెప్పిన రేట్లకే..
ఆంధ్రప్రదేశ్లో థియేటర్స్ టికెట్ రేట్లపై గత కొంత కాలంగా అనేక చర్చలు వాదోపవాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సమస్య కోర్టు వరకు వెళ్లగా సరైన క్లారిటీ రాలేదు. కానీ కోర్టు మాత్రం ఈ విషయంలో ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేయాల్సిన అవసరం లేదు అని కూడా కౌంటర్ ఇచ్చింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్స్ పై కఠిన ఆంక్షలను కొనసాగిస్తోంది. తాము చెప్పిన రేట్లకే టికెట్లను విక్రయించాలని ఆదేశాలను జారీ చేశారు

నాని కౌంటర్స్..
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలకు చాలా థియేటర్లు కూడా మూతపడుతున్నాయి. ఇటీవల శ్యామ్ సింగరాయ్ డిస్ట్రిబ్యూటర్ కూడా మధ్యలోనే చేతులెత్తేసి సినిమా బిజినెస్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో నాని ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న టికెట్ల వివాదంపై స్పందించాడు. సినిమా ధియేటర్ టిక్కెట్ కంటే కూడా పక్కన ఉన్న కిరాణా కొట్టు లో కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని ఆడియన్స్ నీ ఒక విధంగా అవమానిస్తున్నారని కూడా ఏపీ ప్రభుత్వంపై కౌంటర్ ఇచ్చాడు.

అంతకంటే ముందే పవన్..
దానికంటే ముందే పవన్ కళ్యాణ్ టికెట్ల వివాదంపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు నాని కూడా తనదైన శైలిలో స్పందించారు. అతను చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా మద్దతు ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్ నేతలు మాత్రం ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

హీరో నాని ఎవరు
ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నాని చేసిన వ్యాఖ్యలపై ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. హీరో నాని ఎవరు? అంటూ అతను ఎవరో తనకు తెలియదని తనకు తెలిసిందల్లా కేవలం కొడాలి నాని మాత్రమే అని అనిల్ కుమార్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా టికెట్ల రేట్లు తగ్గిస్తే రెమ్యునరేషన్ తగ్గుతోంది అనే బాధ లోనే కొందరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని కౌంటర్ ఇచ్చారు.

రెమ్యునరేషన్ తగ్గుతుందని..
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పై కూడా అనిల్ కుమార్ యాదవ్ ఊహించని విధంగా విమర్శలు చేశారు. 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే వారు హటాత్తుగా 30 కోట్లకు రేటు పడిపోతుంది అనే భయం తోనే ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంతేగాని ఎవరికి కూడా మరొక బాధ లేదని తెలియజేశారు.

బైక్ అమ్మేసి.. పవన్ కటౌట్ లు
అంతేకాకుండా ఒకప్పుడు తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అని తెలియజేసిన అనిల్ కుమార్ యాదవ్ ఆయన సినిమాలు విడుదలైనప్పుడు నా బైక్ అమ్మేసి.. కటౌట్ లో కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అని తెలియజేశారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానుల పరిస్థితి కూడా అంతే అని తెలియజేశారు.. సినిమా ప్రొడక్షన్ ఖర్చు కంటే కూడా రెమ్యునరేషన్ కాస్ట్ ఎక్కువైందని.. దాదాపు బడ్జెట్ లో 80% నలుగురి జేబుల్లోకే వెళ్తున్నాయని అన్నారు. ఇక అందువల్లే కోట్లాది మంది ప్రజలపై భారం వేస్తున్నారని వీళ్ల కోసం టికెట్ రేట్లు పెంచాలా..? అని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











