HBD Ys Jagan: తండ్రితో కలిసి వచ్చిన జగన్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు జన నేతలు
టాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో చాలా రకాల జోనర్లలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారణంగా తెరకెక్కుతోన్న బయోపిక్ మూవీలు కూడా ఉన్నాయి. ఇలా ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ తరహా చిత్రాలు పదుల సంఖ్యలో పట్టాలెక్కుతూనే ఉంటున్నాయి.
తెలుగు ప్రేక్షకులను బాగా అలరించి సక్సెస్ అయిన సినిమాల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా వచ్చిన 'యాత్ర' ఒకటి. దీంతో దర్శకుడు మహి వీ రాఘవ్ ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు అనుగుణంగానే ఇప్పటి ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీతో దీనికి సీక్వెల్ చేస్తున్నాడు.

వైఎస్ జగన్ లైఫ్ స్టోరీపై మహీ వీ రాఘవ్ సుదీర్ఘ కాలం పాటు వర్క్ చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవలే కోలీవుడ్ హీరో జీవాతో ఈ సినిమాను 'యాత్ర 2' టైటిల్‌తో ప్రారంభించాడు. ఆ వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను సైతం విడుదల చేశాడు. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా అప్పటి నుంచి షూటింగ్‌ను శరవేగంగా జరుపుతూ వస్తున్నారు.
2024లో రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 'యాత్ర 2' మూవీని తీసుకు రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి వైఎస్ భారతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ నుంచి జగన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈరోజు (డిసెంబర్ 21) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని 'యాత్ర 2' మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు. ఇందులో జీవాతో పాటు మమ్ముట్టి కూడా దర్శనమిచ్చాడు. అంటే ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు జన నేతలను చూపించారు. అంతేకాదు, ఇందులో 'నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకును' అన్న డైలాగ్‌ను కూడా జోడించారు. మొత్తానికి ఈ పోస్టర్‌కు భారీ రెస్పాన్సే వస్తోంది.
ఇదిలా ఉండగా.. 'యాత్ర 2' సినిమాను త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సీక్వెల్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రాజశేఖర్ రెడ్డిగా మమ్మట్టి, వైఎస్ భారతిగా కేతకీ నారాయన్ నటిస్తున్నారు. ఈ మూవీని 2024 ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











