8 రోజుల్లో ఇస్మార్ట్ శంకర్ వసూళ్లు.. కిర్రాక్ అంటున్న ఛార్మి
ఇటీవలే విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్స్‌లో హవా సాగిస్తోంది. పూరి జగన్నాథ్ మాస్ మసాలా పవరేంటో చూపిస్తూ ఓ రేంజ్‌లో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన 4 రోజుల్లోనే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయిన ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఖుషీ ఖుషీగా ఉన్న ఛార్మి.. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా 8 రోజుల కలెక్షన్స్ తాలూకు పోస్టర్ పంచుకుంది.
ఈ పోస్టర్ ద్వారా 8 రోజుల్లో ఇస్మార్ట్ శంకర్ ప్రపంచ వ్యాప్తంగా 63 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని తెలిపింది ఛార్మి. ఈ మేరకు ' కిర్రాక్ నెంబర్స్' అని పేర్కొంటూ డాన్సింగ్ ఎమోజీలు పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై రామ్ చరణ్, రామ్ గోపాల్ వర్మ లాంటి సినీ ప్రముఖులు ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన మాస్ మసాలా స్ట్రోక్ యూత్ ఆడియన్స్‌కి యమ కిక్కించింది.

తొలి వీకెండ్ ముగిసినా కూడా కలెక్షన్స్ ప్రవాహం ఆగటం లేదు. అయితే విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' విడుదలైంది కాబట్టి.. ఆ ప్రభావం ఇస్మార్ట్ శంకర్ పై పడే అవకాశాలున్నాయని పేర్కొంటున్నాయి ట్రేడ్ వర్గాలు.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి తెరకెక్కించారు.
చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. నిధి, నభా గ్లామర్ డోస్ తెలుగు ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేస్తోంది. పూరి జగన్నాథ్ సహా హీరో రామ్, హీరోయిన్లు నిధి, నభా ఇద్దరికీ ఈ సినిమా అందించిన విజయం టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్న పూరి జగన్నాథ్, ఛార్మి, నిధి అగర్వాల్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రేక్షకుల వద్ద తమ ఆనందం వ్యక్త పరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











