నాగార్జున 100వ సినిమాకు డైరెక్టర్?
ఏ కథానాయకుడికైనా 100వ సినిమా అంటే చరిత్రలో నిలిచిపోయేలా గొప్ప చిత్రాన్ని తీయాలని కలలు కంటుంటారు. వారి వారి అదృష్టాన్ని బట్టి మంచి కథ, మంచి నిర్మాణ విలువలున్న బ్యానర్, మంచి దర్శకుడు దొరుకుతారు. అగ్ర కథానాయకుడి నుంచి ఏ స్థాయి హీరోకైనా 100వ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. మూడు దశాబ్దాలుగా అగ్ర కథానాయకుల్లో ఒకరిగా చలామణి అవుతున్న అక్కినేని నాగార్జున తాజాగా తన 100వ చిత్రానికి సిద్ధమవుతున్నారు.

సిద్ధమవుతున్న కథలు
అక్కినేని నాగార్జున నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమను మలుపుతిప్పే హిట్ శివ వచ్చింది. అక్టోబరు 5న 'ది ఘోస్ట్' చిత్రం రాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాగార్జున తన 100వ సినిమా బాధ్యతను నలుగురు దర్శకులకు అప్పజెప్పినట్లు వెల్లడించారు. వారు కథలను సిద్ధం చేసే పనిలో ఉన్నారని, ఏది బాగుంటే, ఏది నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటుందో అలాంటి కథను ఎంచుకుంటానని చెప్పారు.

స్పెషల్ ప్రాజెక్టుగా నిలవాలి
ఏ హీరోకైనా 100వ సినిమా అంటే ప్రత్యేకంగా నిలుస్తుందని, తనకు కూడా ఒక స్పెషల్ ప్రాజెక్టుగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో వారి నుంచి కథలు వినబోతున్నానని, ఆ నలుగురులో ఎవరు మంచి కథ చెబితే అదే ఫైనల్ అవుతుందన్నారు. కరోనా వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనా తీరులో మార్పు వచ్చిందని, ఇప్పడున్న ఆలోచనలు రేపు ఉండటంలేదని, అంత వేగంగా మారిపోతున్న ట్రెండ్ ను పట్టుకోవాలంటే కష్టమవుతోందన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

చిరంజీవి, బాలకృష్ణ పూర్తిచేశారు
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పడు కొనసాగుతున్న అగ్ర కథానాయకుల్లో చిరంజీవి, బాలకృష్ణ 100 సినిమాలను పూర్తిచేశారు. నాగార్జున, వెంకటేష్ 100వ సినిమాకు దగ్గరలో ఉన్నారు. ఏ కథానాయకుడికైనా 100వ చిత్రం కలల సినిమా అవుతుంది. చిరంజీవి తన 100వ సినిమాగా త్రినేత్రుడు చేశారు. బాలకృష్ణ తన 100వ సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి చేశారు. ఇప్పుడు నాగార్జున, వెంకటేష్ వంతు వచ్చింది.


Click it and Unblock the Notifications











