‘లైగర్’ ఫ్లాప్ తర్వాత.. పూరీ జగన్నాథ్ దిమ్మతిరిగిపోయే ప్లాన్?
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఏలిన విషయం తెలిసిందే. ఆయన రైటింగ్, మాస్ డైలాగ్స్, పంచ్ లకు ఆడియెన్స్ ఊర్రూతలూగిపోయిన విషయం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. పూరీ జగన్నాథ్ పేరు వింటేనే సినీ ప్రియులకు ఒకరకమైన వైబ్రేషన్స్ వస్తుంటాయి. హీరో ఎలివేషన్ సీన్స్ రాయడంలో ఆయన దిట్ట. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి పాన్ ఇండియా చిత్రాలకు కథలను అందించిన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాదే పూరీ రైటింగ్ కు ఫిదా అయ్యారు. పూరీ రైటింగ్ లోని చిక్కుముడులు, సరళతకు ఏకంగా అభిమానిగా మారిపోయానని పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.
2000 నుంచి పదేళ్ల పాటు పూరీజగన్నాథ్ టాలీవుడ్ ను ఒక ఊపూపారు. సినిమా డైరెక్షన్ కు కొత్తదనం చూపించారు... హీరో క్యారెక్టరైజేషన్ కు సరికొత్త నిర్వచనమూ ఇచ్చారు. బద్రి, ఇడియట్, పోకిరి, దేశముదురు, గోలీమార్, ఎక్ నిరంజన్, నేనింతే, బిజినెస్ మెన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలతో స్టార్ హీరోలకు మాస్ ఫాలోయింగ్ తెప్పించిందే పూరీ. కెరీర్ ప్రారంభం నుంచి దశాబ్దం పాటు పూరీ మేనియా నడించింది. కానీ ఆ తర్వాత ఏమైందో గానీ వరుసగా ఫ్లాప్స్ పడుతూనే వస్తున్నాయి.

మధ్య మధ్యలో 'టెంపర్', 'జ్యోతి లక్ష్మి, 'ఇస్మార్ట్ శంకర్' వంటి చిత్రాలు పూరీ మార్క్ ను చూపిస్తున్నాయి. కానీ ఎక్కువ శాతం ఫ్లాప్స్ మాత్రమే మూటగట్టుకుంటున్నారు. ఫాస్ట్ గా షూట్ కంప్లీట్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టడం పూరీకి ఉన్న అలవాటు... ఇక కరోనా తర్వాత తన సెంటిమెంట్ ను కూడా వదులుకొని టైమ్ తీసుకొని సినిమాలు చేస్తున్నారు. అయినా ఫలితం బెడిసికొడుతోంది. అందుకు ఉదాహరణలే 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్'. భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద చతకిల పడ్డాయి. కనీసం ఆడియెన్స్ కూడా ఒప్పుకునేలా లేకపోవడం బాధాకరం.
ఇక ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా... గట్టిగా కంబ్యాక్ ఇవ్వడంలో పెట్టింది పేరు పూరీ జగన్నాథ్. ఈ క్రమంలో... లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో మూటగట్టుకున్న ఫ్లాప్స్ నుంచి బయటపడేందుకు డాషింగ్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్ వేశారంట. కాస్తా టైమ్ తీసుకొని హిట్ సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. 2010లో పూరీ జగన్నాథ్ - గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన 'గోలీమార్'కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారంట. దీనితో పాటు మరో రెండుమూడు స్క్రిప్ట్ లను కూడా రెడీ చేసేందుకు గోవాలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది పూరీ.

రాగానే సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో నిమగ్నం కానున్నరనా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. పూరీ జగన్నాథ్ నుంచి చివరిగా 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్ గా వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడో పదేళ్ల కింద వచ్చిన 'గోలీమార్'కు ఇప్పుడు సీక్వెల్ ఎలా కనెక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కథ, స్క్రీన్ ప్లేలో పూరీ దిట్ట కావడంతో ఈ సీక్వెల్ వార్తలపైనా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది.


Click it and Unblock the Notifications











