‘జన నాయగన్' కోసం విజయ్‌కి రికార్డ్ రెమ్యునరేషన్! దళపతి చివరి మూవీకి పారితోషికం ఎన్ని కోట్లంటే?
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్'. ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్.కే నిర్మించారు. ఈ సినిమాలో మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుండగా, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే సినిమా విడుదలకు ముందు ఇప్పుడు ఓ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే.. 'జన నాయగన్' కోసం దళపతి విజయ్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్స్ తీసుకున్నారు? అనే వివరాల్లోకెళ్లే..
దళపతి విజయ్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టారు. తమిళనాడు సీఎం విజయ్.. ఇదే తన చివరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినా, ప్రస్తుతం రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అందుకే సినిమా ప్రారంభమైన రోజు నుంచే ప్రతి అప్‌డేట్ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. 'జన నాయగన్' కోసం విజయ్ రూ.220 కోట్ల పారితోషికం తీసుకున్నారట. ఈ వార్త నిజమైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా విజయ్ మరో రికార్డు సృష్టించినట్లే.

సినిమా బడ్జెట్‌లో సగం?
'జన నాయగన్' బడ్జెట్ సుమారు రూ.400 కోట్లు అనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. విజయ్ రెమ్యూనరేషన్ ఒక్కటే మొత్తం బడ్జెట్‌లో సగానికి పైగా ఉంటుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. విజయ్ తర్వాత అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా బాబీ డియోల్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఆయనకు రూ.8 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల సౌత్ సినిమాల్లో బాబీ డియోల్‌కు భారీ డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో మరో కీలక పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు. ఈ విలక్షణ నటుడికి రూ.5 కోట్ల పారితోషికం చెల్లించారనే టాక్ నడుస్తోంది. కథలో ఆయన పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందని సమాచారం. హీరోయిన్లలో పూజా హెగ్డే కే అత్యధిక రెమ్యూనరేషన్ దక్కినట్లు తెలుస్తోంది. విజయ్ సరసన నటించిన ఆమెకు రూ.6 కోట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 'బీస్ట్' తర్వాత విజయ్-పూజా జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే.. ప్రియమణికి రూ.3 కోట్లు, యువ నటి మమితా బైజుకు రూ.75 లక్షలు పారితోషికంగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 'జన నాయగన్' దర్శకుడు హెచ్. వినోద్ కు రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం.
జన నాయగన్ సినిమాకు సంగీతం అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కు రూ.13 కోట్లు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు రూ.3 కోట్లు, నరేన్ కు రూ.2.5 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. సినిమా కథలో వీరి పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా జనవరిలోనే రావాల్సింది. కానీ, సెన్సార్ సమస్యలు, విడుదల వాయిదాలు, లీక్ వివాదం వంటి అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో 'జన నాయగన్' చివరకు జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇలా భారీ రెమ్యూనరేషన్స్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications



