35 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో రిపీట్.. చిరంజీవికి విలన్‌గా స్టార్ హీరో.. బాబీ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
Mega 158: మెగాస్టార్ చిరంజీవి.. 70 ఏళ్ల వయసులో కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం అదే జోష్ తో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. ఒకవైపు వశిష్ట దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న 'మెగా 158' (వర్కింగ్ టైటిల్)పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. గతంలో 'వాల్తేరు వీరయ్య'వంటి మాస్ బ్లాక్‌బస్టర్ అందించిన బాబీ -చిరంజీవి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించిన కాస్టింగ్ వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటిలో తాజాగా వినిపిస్తున్న వార్త మాత్రం మెగా అభిమానులను ఉత్సాహపరుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సీనియర్ నటుడు శరత్‌కుమార్ ను మూవీ మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన పాత్రకు నెగెటివ్ షేడ్స్ ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

ఈ వార్త నిజమైతే దాదాపు 35 ఏళ్ల తర్వాత చిరంజీవి-శరత్‌కుమార్ ఒకే సినిమాలో నటించనున్నట్లు అవుతుంది. గతంలో వీరిద్దరూ 'గ్యాంగ్ లీడర్', 'స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్' సినిమల్లో కలిసి నటించారు. అందులో 'గ్యాంగ్ లీడర్' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి ఇద్దరి కెరీర్‌లోనూ గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపించే అవకాశం ఉండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక చిరంజీవి, శరత్‌కుమార్ నిజ జీవితంలోనూ మంచి స్నేహితులు. పలు సందర్భాల్లో శరత్‌కుమార్ మాట్లాడుతూ.. తన జీవితంలో కష్టకాలంలో చిరంజీవి ఎంతో అండగా నిలిచారని చెప్పారు. సరైన కథ దొరికితే మరోసారి కలిసి నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నామని కూడా వెల్లడించారు. ఇప్పుడు ఆ అవకాశం 'మెగా 158' రూపంలో వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే శరత్‌కుమార్ పాత్ర విలన్‌దేనా? లేక కథను మలుపు తిప్పే కీలక పాత్రనా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు దర్శకుడు బాబీ ప్రత్యేకంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న మరో స్ట్రాంగ్ రోల్ ను కూడా రాసినట్లు సమాచారం. ఆ పాత్రలో ఎవరు నటిస్తారనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.
ఈ సినిమాలో చిరంజీవి పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందని టాక్. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో మెగాస్టార్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. పాత్రలో వయసుకు తగ్గ విభిన్న షేడ్స్, ఎమోషన్స్, యాక్షన్, మాస్ ఎలివేషన్స్ అన్నీ ఉండేలా దర్శకుడు బాబీ కథను డిజైన్ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్‌తో సినిమాను రూపొందించేందుకు నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో శరత్‌కుమార్ కూడా తెలుగు సినిమాల్లో వరుస కీలక పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. భరత్ అనే నేను, జయ జానకీ నాయక, భగవంత్ కేసరి, రంగబలి వంటి సినిమాల్లో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. దీంతో ఇప్పుడు చిరంజీవికి ఎదురుగా ఆయన నటిస్తారనే వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. అయితే.. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications




