వివాదంలో మార్ ముంత చోడ్ చింతా.. డబుల్ ఇస్మార్ట్ పాటలో కేసీఆర్ డైలాగ్!
ఇటీవలి కాలంలో బయట బాగా పాపులరైన మాటలను, డైలాగ్స్‌ను పాటల్లో హుక్‌లైన్ పెట్టి వదులుతున్నారు మూవీ మేకర్స్. మాస్ ఆడియన్స్‌కు ఇవి బాగా కనెక్ట్ అవుతుండటంతో బాక్స్‌లు బద్ధలవుతున్నాయి. నాక్ నాక్ నాకొద్దు, నన్నొదిలేస్తావా రా అనే పాటలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఈ ఏడాది మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సినిమాలోని ఆ కుర్చీని మడత పెట్టి అనే సాంగ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కుర్చీ తాత అనే ఒకాయన ఫేమస్ ఊతపదంను తీసుకుని థమన్ ఈ ప్రయోగం చేసి సక్సెస్ కొట్టాడు. ఈ సాంగ్ చూడటానికే జనం థియేటర్లకు పరుగులు తీశారంటే అతిశయోక్తి కాదు.
తాజాగా ఎనర్జీటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ అనే మూవీ తెరకెక్కుతోంది. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ మూవీని త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. సాయాజీ షిండే, బాణి, గెటప్ శ్రీను, అలీ, మకరంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్‌లు నటిస్తున్నారు.

తన సినిమాల్లో ఐటెం సాంగ్స్‌పై స్పెషల్ ఫోకస్ పెడతారు పూరీ జగన్నాథ్ . మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు కావడంతో వారికి తగ్గట్లుగానే స్పెషల్ సాంగ్స్ తెరకెక్కిస్తారు. గత ఇస్మార్ట్ శంకర్‌లోనూ చిలక చిలక సాంగ్ బాగా ఫేమస్ అయ్యింది. నిధి అగర్వాల్, నభా నటేష్‌ల అందాలకు రామ్ డ్యాన్స్ తోడు కావడంతో ఈ పాట జనాల్లోకి బాగా వెళ్లింది. లేటెస్ట్ ఇస్మార్ట్ శంకర్‌లోనూ ఓ ఐటెం సాంగ్‌ను తెరకెక్కించిన ఆయన నిన్న రిలీజ్ చేశారు. 'మార్ ముంత చోడ్ చింత' అంటూ సాగే ఈ పాట మాస్‌ను ఊపేస్తోంది.
అయితే ఈ సాంగ్ చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తోంది. ఇందుకే కారణం కేసీఆర్. అదేంటి చిత్ర పరిశ్రమకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వల్ల వివాదం ఏంటీ అనుకుంటున్నారా. కల్లు కాంపౌండ్‌లో నడిచే ఈ పాటలో హీరో, హీరోయిన్లు రామ్, కావ్య థాపర్‌లు కల్లు సీసాలు పట్టుకుని చిందులేస్తారు. పాట మధ్యలో ''ఏం జేద్దామంటావ్ మరీ' అని గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను హుక్‌లైన్‌గా వాడారు.
గతంలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే ఆయన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో కేసీఆర్ మాటలను యధాతథంగా పాటలో వాడుకున్నారు పూరీ. కేసీఆర్ సంబంధించిన పాపులర్ డైలాగ్‌ను వాడుకోవడం పాటలో ఎట్రాక్షన్‌గా మారింది. ఈ పాటపై బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు.
తెలంగాణ సాధించిన వ్యక్తిని, కోట్లాది మంది ఆరాధించే నేతను, పైగా మాజీ ముఖ్యమంత్రిని కించపరిచేలా ఈ పాటను పూరీ జగన్నాథ్ రూపొందించారని ఫైర్ అవుతున్నారు. తెలంగాణ అనగానే మందుకొట్టుడే అన్న భావన కలిగించేలా కేసీఆర్ మాటలను చొప్పించారని వారు ఫైర్ అవుతున్నారు. గీత రచయిత కాసర్ల శ్యామ్, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరూ తెలంగాణవారే కావడాన్ని తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. సదరు పాటలోని కేసీఆర్ మాటలను తొలగించి .. తెలంగాణ సమాజానికి పూరీ జగన్నాథ్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎలా టర్న్ అవుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











